Deccan Chronicle : టీడీపీ శ్రేణులు దాడి చేసేంత‌గా 'డెక్కన్ క్రానికల్' ఏం రాసింది.?

విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖండించింది.

By :  Eha Tv
Update: 2024-07-11 03:02 GMT

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్‌ వార్త రాసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్‌వర్మ చేస్తున్న ప్రకటనలు ప్రైవేటీకరణ అనివార్యమని సూచిస్తున్నాయని వార్త‌లో పేర్కొంది. దీనిపై బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, టీడీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. సెక్యురిటీ పోస్ట్‌ను ధ్వంసం చేశారు, కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా దినపత్రిక నేమ్ బోర్డ్‌ను కూడా కాల్చివేశారు.

'డెక్కన్ క్రానికల్' ఏం రాసింది.?

డెక్కన్ క్రానికల్ వార్తా సారాంశం.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్‌వర్మ చేస్తున్న ప్రకటనలు ప్రైవేటీకరణ అనివార్యమని సూచిస్తున్నాయి. వారం రోజుల క్రితం శ్రీనివాసరావు డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. 8,000 కోట్ల పునరుద్ధరణ నిధులు, 22,000 ఎకరాల భూమిని ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బదిలీ చేయాలని కోరుతోందన్నారు.

దీనికి విరుద్ధంగా భారీ పరిశ్రమల మంత్రి శ్రీనివాస్‌వర్మ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం NDA ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగమని చెప్పారు. ఈ ఏడాది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లిందని.. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేయనివ్వదని అన్నారు. RINL గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,859 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దాని సామర్థ్యం 7 MT సామర్థ్యం కంటే చాలా తక్కువగా ఉంది. ఏటా కంపెనీ భారీ నష్టాలను చవిచూస్తుంటే ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు.

ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సెయిల్‌(SAIL)తో విలీనం చేయాలని తెలుగుదేశం సూచిస్తోంది. తద్వారా కంపెనీ ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. సులభంగా లాభాలను ఆర్జించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్టాండ్‌ను మార్చుకుని.. పునరుజ్జీవన ప్యాకేజీని ప్రభుత్వం కోరుతుందని శ్రీనివాసరావు ప్రకటించారు.

గత మూడున్నరేళ్లుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక సంఘాల నేతలను శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాస్‌వర్మల ప్రకటనలు కలవరపరిచాయి.

స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలు ఆర్‌ఐఎన్‌ఎల్‌ను నష్టాల్లోకి నెట్టాయన్నారు. RINL 2021లో 28,000 కోట్ల టర్నోవర్ చేసి లాభాలను ఆర్జించింది. కానీ, ప్రైవేటీకరణ ప్ర‌క‌ట‌న‌ తర్వాత ముడిసరుకును పొందడంలో RINLకి అడ్డంకులు వచ్చాయని.. దీని వల్ల ఉత్పత్తి పడిపోయిందని ఆయన చెప్పారు. స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.వి.డి. ప్రసాద్ మాట్లాడుతూ.. సెయిల్‌లో విలీనం మంచి నిర్ణయమని, ఇది ప్లాంట్‌ను కాపాడుతుందని.. కార్మికులకు, నిర్వాసితులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. క్యాప్టివ్ మైన్స్ ఉన్న సెయిల్, ఆర్‌ఐఎన్‌ఎల్‌ను టేకోవర్ చేయడం ద్వారా దక్షిణాది మార్కెట్లను కైవసం చేసుకోవచ్చని.. 30 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయడానికి విస్తరణ చేయగలదని ఆయన అన్నారు. ప్రస్తుతం సెయిల్ 20 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేస్తోంది. "సెయిల్‌లో విలీనం కాకుండా పునరుద్ధరణ ప్యాకేజీ కోసం ఎందుకు ఒత్తిడి తెస్తుందో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సమాధానం చెప్పగలదు" అని ప్రసాద్ డీసీకి చెప్పారు.

గత YSRC ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రైవేటీకరణ ప్రణాళికను కొనసాగించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన సౌకర్యాన్ని కల్పిస్తారని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.

RINL ప్లాంట్ 7 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తాజా పెట్టుబడిని పంపిస్తే 17 MT వరకు విస్తరించవచ్చు. అయితే కేంద్రం RINL ప్రైవేటీకరణ కోసం ఒక తాజా ప్రణాళికను రూపొందించింది. దీంతో కొనుగోలుదారులు 7 MT ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించడానికి నిబద్ధత ఇవ్వవలసి ఉంటుందని వర్గాలు తెలిపాయి.

కాగా, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకుంటారు. వీఎస్పీ అతిథిగృహంలో రాత్రి బస చేసిన మంత్రి గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారిక ప్రకటన మంగళవారం తెలిపింది అంటూ డీసీ వార్త రాసింది. ఈ వార్తపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి.

దాడిని ఖండించిన బీజేపీ

విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖండించింది. మీడియా సంస్థలపై దాడులు కూటమి పార్టీల సంస్కృతి కాదని, అలాంటి సంస్కృతిని ప్రోత్సహించరాదని బీజేపీ కాకినాడ అర్బన్ కన్వీనర్ గట్టి సత్యనారాయణ అన్నారు. ఫలానా వర్గం మనోభావాలు ఇబ్బంది పెడితే మీడియా సంస్థల నుంచి సమాధానాలు అడగాలి కానీ దాడులు మాత్రం సమస్యలకు పరిష్కారం కాదన్నారు.

ఈ దాడులను దుర్మార్గపు సంస్కృతిగా బీజేపీ నేతలు అభివర్ణించారు. కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో పార్టీ పరువు పోతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, టీడీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. సెక్యురిటీ పోస్ట్‌ను ధ్వంసం చేశారు, కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా దినపత్రిక నేమ్ బోర్డ్‌ను కూడా కాల్చివేశారు.

పిరికి పంద చర్య : మాజీ సీఎం జగన్‌

విశాఖపట్నంలో డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, అది పిరికి పంద చర్య అని మాజీ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ చర్య మీడియాను అణచివేసే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. నిష్పక్షపాత వార్తలను టిడిపి జీర్ణించుకోలేక ఇలాంటి దాడులకు తెగబడుతోందని అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజస్వామ్యం ఖూనీ అవుతోందని, ఈ దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

ప్రజాస్వామ్యంపై దాడి.. మల్లాది విష్ణు

దాడిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు ఖండించారు. టీడీపీ మద్దతు ఉన్న మీడియా గత ఐదేళ్లు నిరాధారమైన, పక్షపాతంతో కూడిన నివేదికలను ప్రచురించింది.. ప్రసారం చేసింది, అయితే "మేము ఈ రకమైన దాడులను ఆశ్రయించలేదు" అని గుర్తుచేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై తన వైఖరిని స్పష్టం చేయాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. డీసీ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి. మీడియా, మీడియా సిబ్బందిపై దాడులు ఆపడం ద్వారా టీడీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఎం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు దాడిని ఖండిస్తూ.. ఇది వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమేనని అభివర్ణించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను రద్దు చేయాలని గతంలో టీడీపీ డిమాండ్‌ చేసిందని.. ఇప్పుడు ఆ విషయంలో టీడీపీ అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పత్రికలపై దాడులు ఆపాలని బాబురావు డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యానికి ముప్పు.. గిడుగు రుద్రరాజు

ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి, ప్రజాస్వామ్యానికి ముప్పు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన నివేదికలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. టీడీపీ ఓ నివేదికతో ఏకీభవించనట్లయితే.. హింసాత్మక దాడిని ఆశ్రయించకుండా రిజైండర్ జారీ చేయాలన్నారు.

Tags:    

Similar News