Andhra Pradesh : ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ అధికారులతో నేడు సమీక్ష జరిగిందని, ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఝంగా చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్థేశించడం జరిగిందన్నారు. రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించడం జరిగిందన్నారు.
హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మద్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారుల విషయంలో పక్షపాత పూరితంగా వ్యవహరించి పూర్తి అయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్నారు. ఇటు వంటి బాధిత లబ్దిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలను కల్పించ లేదని, అటు వంటి లేవుట్లలో కూడా మౌళిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. 2014-19 మరియు 2019-24 మధ్య పోల్చితే గృహనిర్మాణ పధకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుండి 10 వేల కోట్ల వరకూ పేదలకు అన్యాయం జరిగిందని, పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైసిపి ప్రభుత్వం ఆర్ధిక లాభాన్ని పేదవారికి అందకుండా చేసిందన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బిసి అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి వారికి కూడా ఎలాంటి అదనపు లబ్దిలేకుండా చేశారన్నారు. 2014-19 మద్య కాలంలో యూనిట్ ఖరీదు రెండున్నర్ర లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.50 లక్షల నుండి రూ.1.00 లక్షల వరకూ లబ్దిచేకూర్చడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.4.00 లక్షల యూనిట్ కాస్టుతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుండి మంజూరు చేయడం జరుగుతుందని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్దిచేకూర్చేందుకు త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పి.ఎం.ఏ.వై. పథకం ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాలు ప్రగతిలో ఉన్నాయని, వాటి కూడా తమ ప్రభుత్వం పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు. పిఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట, సంబందిత లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చే అవకాశం కొత్త పధకంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.