ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పటికీ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికీ అనుమానాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పటికీ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికీ అనుమానాలున్నాయి. ఫలితాలను నమ్మలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలు ఇలా ఉండాల్సింది కాదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ అంటూ ఉంటున్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజం. ఓడిపోవడం సరే, ఈ స్థాయిలో ఓటమిని అదీ ఇన్ని తక్కువ సీట్లు రావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. ఆ పార్టీకి చెందిన నాయకులు ఈవీఎంల అంశానికి చెందిన పోరాటం, ఆ పోరాటం సందర్భంగా ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు మాట్లాడిన మాటలు, ఈసీ రెస్పాన్స్‌, ఇప్పటికీ ఆంధప్రదేశ్‌కు సంబంధించి ఒక్క చోట కూడా వీవీ ప్యాట్లను లెక్కించే కార్యక్రమాన్ని చేపట్టకపోవడం, ఫామ్‌ 20కి సంబంధించిన డిటైల్స్‌ను అప్‌లోడ్‌ చేయడంలో ఆలస్యం జరగడం, ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్‌లు 90 శాతానికి పైగా ఉండటం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై నిందలు వేయడం చాలా రోటిన్‌ అయ్యింది. అందుకే ఏపీలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కూడా ఇలాంటివేనని అనుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు చాలా తేడా ఉందని అనేక స్వచ్ఛంద సంస్థలు స్పష్టమైన ఆధారాలతో చూపిస్తున్నాయి. ఈసీ వెబ్‌సైట్‌లో కూడా తప్పుడు లెక్కలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఒకలా ఉంది. లెక్కించిన ఓట్ల సంఖ్య మరోలా ఉంది. రెండింటికి మధ్య చాలా వేరియేషన్‌ ఉంది. ఇది ఆరోపణ కాదు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనే ఈ తప్పుడు లెక్కలు ఉన్నాయి. ఎలెన్‌ మస్క్‌ లాంటి వారు కూడా ప్రజాస్వామ్యం గురించి, బ్యాలెట్‌ పేపర్ల గురించి మట్లాడిన మాటలు చూస్తే దేశంలో ఈవీఎంలలో ఏదో జరిగే ఉంటుందని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా పోరాటం చేయకపోయినప్పటికీ, ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఫలితాలపై కోర్టులో కేసులు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేసిన మీనా వీవీ ప్యాట్లను కాల్చేశారు. ఇందుకు సంబంధించిన సర్క్యూలర్‌ కూడా వచ్చింది. లోక్‌సభ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దీన్ని బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఎన్నేసి అనుమానాలు ఉన్నాయో, తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా అన్నేసి అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో పోలిస్తే ఇంకాస్తా ఎక్కువే! హర్యానాలో బీజేపీ గెలుస్తుందని చెప్పిన సర్వే ఏజెన్సీ లేనే లేదు. భారతీయ జనతాపార్టీకి చెందిన నాయకత్వం కూడా హర్యానాలో గెలుస్తామని అనుకోలేదు. బీజేపీ అధినాయకత్వం ఫోకస్‌ అంతా జమ్ము కశ్మీర్‌పైనే ఉండింది. అక్కడ గెలవడం కోసం అన్ని వ్యూహాలను పన్నింది. నిజానికి హర్యానాను బీజేపీ వదిలేసింది. అలాంటిది హర్యానాలో బీజేపీ గెలవడం చాలా మందిని ఆశ్చర్యపర్చింది. కాంగ్రెస్‌ పార్టీ విజయంపై ధీమాతో ఉండింది. ఫలితాల తర్వాత మళ్లీ ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఈ చర్చలో మొదటిసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఎంటరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోలాగానే హర్యానాలో కూడా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని అన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. జగన్ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే బీజేపీ తీరుపై జగన్‌ ఈ స్థాయిలో విమర్శించడం ఇదే మొదలు. బీజేపీ రియాక్టవ్వకపోతే జగన్‌ దీనికి ఇక్కడితో వదిలేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీ జగన్‌కు వ్యతిరేకంగా రియాక్టయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఏం చేస్తుంది? కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ehatv

ehatv

Next Story