Chandrababu : చంద్రబాబు గారు ..సింగ్ నగర్ రండి !
విజయవాడలో(Vijayawada) వరదలు(Floods) వచ్చాయి.
విజయవాడలో(Vijayawada) వరదలు(Floods) వచ్చాయి. తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడందరూ హాపీగా ఉన్నారని అనుకోవడానికి లేదు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అక్కడే ఉన్నారు. వరద నీటిలోనే తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. వరదసహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రతీ అంశాన్ని చంద్రబాబు పట్టించుకున్నారని మీడియా రాసుకొచ్చింది. తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూలమీడియా అయితే ఇంకాస్తా ఎక్కువ రాసుకొచ్చింది. ప్రజల దగ్గరకు వెళ్లిన ఫోటోలు, బోట్లలో తిరుగుతున్న ఫోటోలను పెద్దగా ప్రచురించాయి. నిద్రాహారాలు మానేసి కలెక్టరేట్‌లోనే చంద్రబాబు గడిపారని చెప్పాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం రాలేదు. తాను అక్కడికి వెళితే ప్రజలందరూ నన్ను చూసేందుకు వస్తారని, సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని పవన్ చెప్పుకొచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్న సమయంలో గోదావరి జిల్లాలలో వరదలు వచ్చిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వరద ప్రాంతాలకు వెళ్లలేదు. ఆ మాటకొస్తే చంద్రబాబునాయుడే ముందుగా వెళ్లారు. తర్వాత జగన్ వెళ్లారు. వరదబాధితులతో సమావేశమయ్యారు. వరదల సమయంలో అధికారులు వచ్చారా? వాలంటీర్లు వచ్చారా? వరదల సమయంలో మీకు అన్ని సాయాలు అందాయా? మీకు రేషన్ అందిందా? ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు పంపించామని, అవి మీకు అందాయా? అనే విషయాలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వరద సమయంలో అధికారులు తమ పనులు తాము చేసుకుంటూ వెళుతున్నప్పుడు ముఖ్యమంత్రో మంత్రులో వెళితే ఆ మెకానిజం అంతా డిస్ట్రబ్ అవుతుంది. పై నుంచి మానిటర్ చేయడం ద్వారా ప్రజలకు ప్రాపర్‌గా సర్వీసు అందుతుందా లేదా తెలుసుకున్నారు జగన్. అప్పుడు ప్రజలెవ్వరూ తమకు సాయం అందలేదని చెప్పలేదు. అధికారులు వచ్చారని, వాలంటీర్లు వచ్చారని, ఆర్ధిక సాయం అందిందని, బియ్యం, పప్పులు వంటివి ఇచ్చారని ప్రజలు తెలిపారు. అంతే తప్ప ప్రజలు ఆందోళన చేయడం కనిపించలేదు. అసంతృప్త స్వరాలు వినిపించలేదు. తాజాగా విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిజికల్‌గా అక్కడికి వెళ్లారు. అందరినీ కాపాడుకోగలిగామని చెప్పుకున్నారు. ఇప్పుడు వరదలు తగ్గిపోయాయి. సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము 530 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అక్కడి ప్రజలలో కొందరు తమకు సాయం అందలేదని చెబుతున్నారు. ఆందోళన చేస్తున్నారు. కలెక్టరేట్ ముందు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దరఖాస్తులు ఇవ్వడానికి క్యూలు కడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సిందల్లా, ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్లిరావడమే. ఆ ప్రాంతాలను పర్యటించి, పరిశీలన చేస్తే అందరికీ వరద సాయం అందిందా లేదా అన్నది తేలిపోతుంది.