YNR Analysis:కరెంట్ షాక్.... కళ్లు మూసుకున్న మీడియా!
దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కరెంట్ పిడుగు పడబోతున్నది.
దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కరెంట్ పిడుగు పడబోతున్నది. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల కరెంట్ భారం ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన వచ్చే ఏడాది కాలం పాటు పడబోతోంది. ఈ భారం కచ్చితంగా గతంలో ఎప్పుడూ లేని భారంగా కనిపిస్తోంది. 40పైసలు ప్రతి యూనిట్‌కు వినియోగదారులు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. 6000 కోట్ల రూపాయలను ఏడాదిలోపే విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రభుత్వం పిండుకోబోతోంది. రాష్ట్రాలలో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్నది చాలా కామన్. చాలా సందర్భాలలో కరెంట్ ఛార్జీలు పెరగడం చూశాం! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో ఆరేడు సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా కరెంట్ ఛార్జీలను పెంచుతూనే వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కరెంట్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఎక్కువ ధరకు కరెంట్‌ను కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో కూడా అక్రమాలు జరుగుతున్నాయి, కుంభకోణాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ ప్రజలు భరించాల్సి వస్తున్నది. కరెంట్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఓ చేదు అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలను బాగా పెంచారు. చార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు, కాంగ్రెసపార్టీ ఆందోళన చేశాయి. హైదరాబాద్ బషీర్‌బాగ్ దగ్గర ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి ఇదో రెండో పెద్ద మరక. మొదటిది ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడమన్నది తెలిసిన విషయమే! విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై చంద్రబాబు వ్యవహరించిన తీరు పట్ల తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. తర్వాత చంద్రబాబు ఓడిపోవడానికి ఇది బలమైన కారణంగా నిలిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన వేశారు చంద్రబాబు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఊరూరా వాడవాడన జగన్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచిందంటూ తెగ బాధపడిపోయారు. కరెంట్ బిల్లుల కారణంగా ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని వాపోయారు. కరెంట్ బిల్లులు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచనే పెంచమని మాట ఇచ్చారు చంద్రబాబు. అయిదేళ్ల పాటు పైసా కూడా పెంచేది లేదని ప్రజలకు హామీ ఇచ్చారు. పైగా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. సంపద సృష్టించి ఛార్జీలు తగ్గిస్తామని ప్రతీ సభలోనూ చెప్పుకుంటూ వచ్చారు. టీడీపీ అనుకూల మీడియా కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు పతాకశీర్షికలో స్థానం కల్పించి మురిసిపోయాయి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు. 6 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన వేశారు. ఇది ఒక రకంగా మాట తప్పడమే. తగ్గించడం మాట దేవుడెరుగు.. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతా ఛార్జీలను పెంచడమే చెప్పుకోవాల్సిన విషయం! ఇది గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఫలితం అంటూ టీడీపీ మీడియా అంటోంది. చిత్రమేమిటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితమే కరెంట్ ఛార్జీలు అని కూటమి నేతలు కూడా చెప్పలేదు. కానీ టీడీపీ కోసమే పని చేసే మీడియా, చంద్రబాబు అనుకూల మీడియా, తెలుగు ప్రజల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని మీడియా, కేవలం తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్న మీడియా కూటమి నేతల కంటే ముందే స్పందించి కరెంట్ ఛార్జీలను పెంచడానికి గత ప్రభుత్వమే కారణమని చాట భారతాన్ని రాసుకొచ్చింది. వీళ్లను కూలీ మీడియా అనకుండా మరి ఏమంటాం?