Yanamala Rama Krishnudu: తెలుగుదేశంపార్టీకి యనమల ద్రోహం చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్, మాజీ ఆర్ధిక మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ఓ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్, మాజీ ఆర్ధిక మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు కచ్చితంగా ప్రజలకు సంబంధించిన అంశాలే! బలహీనవర్గాలకు సంబంధించిన అంశాలే! ఓ ప్రాంతం బాగుకు సంబంధించిన అంశాలే! నిజం చెప్పాలంటే ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే! ఓ పార్టీ అధినేతకు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లేఖ రాయడం తప్పేమీ కాదు. ఇదేం కొత్త కూడా కాదు. ఆ లేఖను తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే యనమల లేఖ రాయడాన్ని తెలుగుదేశంపార్టీ(TDP) తప్పుపట్టినట్టు ఎక్కడా కనిపించలేదు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియాకు మాత్రం కోపం వచ్చేసింది. ఓ పార్టీ అధ్యక్షుడికి, ఓ సీనియర్ నాయకుడు లేఖ రాస్తే, అది కూడా కాకినాడ పోర్టు విషయమై లేఖ రాస్తే టీడీపీ మీడియాలో అది కనిపించలేదు. ప్రచురించడానికి టీడీపీ మీడియాకు మనసొప్పలేదు. యనమల చేసిన పాపమేమిటి? తెలుగుదేశంపార్టీకి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తూ వస్తున్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబు కంటే యనమలనే పార్టీలో సీనియర్..ఈ రోజుల చంద్రబాబునాయుడు నాయకత్వంలో తెలుగుదేశంపార్టీ ఉందంటే దానికి కారణమైన అత్యంత కొద్ది మంది కీలకమైన వ్యక్తులలో యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu) ఒకరు. అలాంటి వ్యక్తి ఓ లేఖ రాస్తే దాన్ని ప్రచురించాల్సిన అవసరం లేదా? లేఖలోని కంటెంట్ తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియాను సంతృప్తి పరిచే విధంగా ఉండాలా? అప్పుడే ప్రచురిస్తాయా? తమకు నచ్చిన వార్తలను ప్రచురించే దానికి మేము ప్రజల పక్షమని, ప్రజా సమస్యలను ఎత్తి చూపుతామని, దమ్ము, దుమ్ము మా సొంతమని, ఇంకా ఏదేదో చెప్పుకోవడం ఎందుకు? టీడీపీకి మంచి చేసే వార్తలనే ప్రచురిస్తామని చెప్పుకుంటే అయిపోతుంది కదా! ఈ నాటకాలు దేనికి? తెలుగుదేశంపార్టీ ప్రయోజనాల కోసం నడపబడుతున్న పత్రిక అని మాస్టర్ హెడ్ కింద రాసుకుంటే పనైపోతుంది కదా! మీరు రాసుకోకపోయినా జనం మాత్రం అదే అనుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం. యనమల రాసిన లేఖలో ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించినట్టు లేదు. కాకినాడ పోర్టు(kakinadaport)కు సంబంధించి కేవీ రావు(KV Rao) తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరలకు అమ్ముకున్నాడని రాశారు యనమల. అలా కొన్న వారిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారంటూ వారి పేర్ల వెనుక చౌదరి అని రాశారు. చౌదరి అని రాసినందుకు పచ్చ మీడియాకు కోపం వచ్చిందట! అందుకే ఆ లేఖను ప్రచురించలేదట!