విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Vizag steel plant) తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన సంస్థ.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Vizag steel plant) తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన సంస్థ. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆ రోజుల్లో ప్రతి నోటా వినిపించేది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తెలుగు ప్రజలు పోరాటం చేశారు. ఆందోళనలు చేశారు. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీ కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంతో మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు ఎవరో దయదలచి ఇచ్చింది కాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పోరాడి సాధించుకున్నది. అలాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు(Privitazation) ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయపార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రైవేటీకరణ మాత్రం ఆగడం లేదు. అడుగులు ముందుకే పడుతున్నాయి. నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకుని, నిర్ణయాన్ని అమలు చేయడానికి అడుగులు వేస్తున్న సమయంలో ఏపీ బీజేపీకి(AP BJP) చెందిన నేతలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహరావు(GVL Narsimha) వంటి వారు బహిరంగంగానే తమ నిరసన తెలుపుతున్నారు. ప్రైవేటీకరణను ఆపాలంటూ చెబుతున్నారు. ఆపడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెంత చెబుతున్నా, మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మాత్రం ప్రైవేటీకరణ దిశగానే వెళుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తామని గతంలో బీజేపీ చెప్పింది. అందుకే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటువారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలలో ఏమీ లేదు. లాభాలను ఆర్జిస్తూ వస్తున్నది. మైన్స్‌ను ఇస్తే ఎక్కువ లాభాలు వస్తాయని మేథావులు చెబుతున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఏకైక మార్గం దానికి మైన్స్‌ ఇవ్వడమే. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడు అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌(KCR) రియాక్టయ్యారు. తమకు సింగరేణి కాలరీస్‌ ఉన్నాయి కాబట్టి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తామే కొనుగోలు చేస్తామని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయనాయకులు మాట్లాడుతున్న మాటలు కంటితుడుపుగా ఉంటున్నాయే తప్ప యాక్షన్‌ ఉండటం లేదు. పైపైన అలా చెబుతున్నారు కానీ సీరియస్‌గా ఎఫర్ట్‌ పెట్టడం లేదు. తమిళనాడులో జల్లికట్టును నిషేధించినప్పుడు తమిళనాడులోని రాజకీయపార్టీలన్నీ రోడ్లమీదకు వచ్చాయి. ప్రజలతో కలిసి పోరాటం సాగించాయి. జల్లికట్టు తమ సంప్రదాయమని, తమ సంస్కృతిలో ఓ భాగమని, నిషేధించడానికి మీరేవరని ప్రశ్నించాయి. తమిళనాడు సినీ పరిశ్రమ కూడా కదిలి వచ్చింది. నటీనటులందరూ జల్లికట్టుకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అందరూ కలిసి కట్టుగా జల్లికట్టును కాపాడుకోగలిగారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ , దాన్ని లాభాలలో తీసుకురాగలిగే అవకాశం ఉన్నప్పటికీ, అన్ని రాజకీయపార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నప్పటికీ విశాఖ ఉక్కు అనాథగానే ఉంటోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం నోరు మెదపడం లేదు. ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచించే సినిమా ఇండస్ట్రీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది.?



Eha Tv

Eha Tv

Next Story