Political Parties Mark On Heroes:హీరోలకు పార్టీలేమిటి?
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరికొద్ది గంటలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. దాదాపు 12 వేల స్క్రీన్ లలో పుష్ప (Pushpa)సినిమా విడుదల అవుతోంది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరికొద్ది గంటలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. దాదాపు 12 వేల స్క్రీన్ లలో పుష్ప (Pushpa)సినిమా విడుదల అవుతోంది. పుష్ప 2 సినిమాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీహార్(Bihar) లాంటి ప్రాంతంలో దక్షిణభారత హీరోకు ఇంతటి క్రేజ్‌ను చూడటం ఇదే మొదటిసారి.తెలుగు ప్రజలందరూ గౌరపడాల్సిన సందర్భం ఇది! మన ప్రాంతానికి చెందన హీరో ఆ స్థాయికి చేరుకున్నాడంటే మనకు గర్వకారణం. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్(Ap)కు సంబంధించి అల్లు అర్జున్(Allu Arjun)కు వ్యతిరేకంగా ఓ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌పై ఉన్న వ్యతిరేకతను సినిమాపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బన్నీపై వ్యతిరేకత లేదనే అనిపిస్తోంది. టికెట్ల ధరను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇందుకో ఉదాహరణ. అయితే ప్రభుత్వానికి సంబంధించిన కొంత మంది హ్యాండిల్స్ నుంచి నెగటివ్ ప్రచారం వస్తున్నదని ఈజీగా అర్థమవుతోంది. హీరోలకు రాజకీయ పార్టీలేమిటి? ఓ హీరో ఫలానా పార్టీకి చెందినవారైతే ఆయన సినిమాలు ఎవరూ చూడకూడదా? ఓ హీరో ఫలానా పార్టీకి మద్దతు ఇస్తే ఆయన సినిమాలను బంద్ చేయాలా? ఓ హీరో ఫలానా పార్టీకి సానుభూతిపరుడు అయితే ఆయన సినిమాను ఎవరూ పట్టించుకోకూడదా? ఓ హీరో ఫలానా పార్టీకి చెందినవారి బంధువో, మిత్రుడో అయితే అతడి సినిమాలను బ్యాన్ చేయాలా? ఇది అల్లు అర్జున్ సినిమాతోనే ఎందుకు మొదలవుతున్నది? ఎందుకింత నెగటివ్ ప్రచారం చేస్తున్నారు? నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పని చేసిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో నటించారు.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ సినిమాను కేవలం తెలుగుదేశంపార్టీవాళ్లు చూస్తేనే హిట్టవ్వలేదు కదా! ఎన్టీఆర్‌లోని ఓ నటుడుని చూసి అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలకు చెందిన వారు ఆ సినిమాను చూశారు. ఎన్టీ రామారావు తెలుగుదేశంపార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన సినిమాను ఎవరూ చూడకూడదని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress party) ఏమైనా ప్రచారం చేసిందా? ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా? లేదు కదా? ఫలానా నటుడు ఏ పార్టీకి చెందిన వాడు అన్నది ప్రజలకు అవసరం లేదు. దాన్ని పట్టించుకోరు కూడా !తమిళనాడుకు చెందిన సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajini kanth) డిఎంకే పార్టీకి మద్దతు ఇచ్చాడు. అయినప్పటికీ రజనీకాంత్ సినిమాలు సూపర్‌హిట్టయ్యాయి. ప్రజలెవ్వరూ రజనీకాంత్‌ను ఓ పార్టీ మనిషిగా చూడలేదు. మిగతావారంతా వ్యతిరేకించలేదు. ప్రేక్షకులకు పార్టీలు ఉండవు. కురచ మనస్తత్వం ఉన్న కొంతమంది నాయకులే ఇలా ప్రవర్తిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టుకుని, తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు హిట్టయ్యాయి. చిరంజీవిని కాంగ్రెస్ మనిషిగా ప్రేక్షకులు చూడలేదు. ఆయనను మెగాస్టార్‌గా మాత్రమే చూశారు. బాలకృష్ణ సినిమాలను కూడా తెలుగుదేశంపార్టీ వారే చూడరు కదా! అందరూ ఆయన సినిమాలు చూస్తున్నారు కాబట్టే వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.