హైడ్రాకు తత్వం బోధపడినట్టుగా అనిపిస్తోంది. హైడ్రా పేరుతో హైదరాబాద్‌ను హడలెత్తించిన ఒక సంస్థ ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంది.
హైడ్రాకు తత్వం బోధపడినట్టుగా అనిపిస్తోంది. హైడ్రా పేరుతో హైదరాబాద్‌ను హడలెత్తించిన ఒక సంస్థ ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంది. హైడ్రా సైలెంటయ్యంటే దానికి ఇగో వస్తుందేమో కానీ హైడ్రా నోరుమూసుకుని కూర్చుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. హైడ్రా చేసిన హడావుడి వల్ల, హైడ్రా చేసిన అతి వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందనే ఇంప్రెషన్ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఈ కారణంగానే హైడ్రాను నోరుమూసుకుని కూర్చోమని ఆదేశించినట్టుగా ఉంది. హైడ్రా హడావుడి ప్రస్తుతానికి కనిపించడం లేదు. శని, ఆదివారాలు వస్తే చాలు ఎక్కడ తమ ఇల్లులు కూలిపోతాయోనని పేదలు ఆందోళన చెందారు. భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు హైడ్రాను మర్చిపోయారు. హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టిన సందర్భంలో ఆ సంస్థ చీఫ్ రంగనాథ్‌గారు ఏమన్నారో అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎఫ్‌టీఎల్‌లో, బఫర్ జోన్‌లో అనుమతులు తెచ్చుకునే ఇళ్లు కట్టుకున్నారని, మరి వాటి పరిస్థితి ఏమిటని అడిగితే, అనుమతులు రద్దు చేసి మరీ కూల్చేస్తామని రంగనాథ్ ప్రకటించారు. ఇది అహంకారంతో వచ్చిన మాటో, అధికార దర్పంతో వచ్చిన మాటో తెలియదు కానీ ఈ మాటలు ప్రభుత్వానికి అప్రతిష్టను, చెడ్డపేరును తెచ్చాయన్నది నిజం. హైదరాబాద్‌లో ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురి చేసింది హైడ్రా. అక్కినేని నాగార్జున(nagarjuna) ఎన్ కన్వెన్షన్(nconvention) కూల్చివేత సందర్భంగా కోర్టు నోటీసులు అందేలోపే గంటల వ్యవధిలో దాన్ని నేలమట్టం చేశారు. నేలమట్టం చేసి ఏం సాధించారంటే ప్రభుత్వానికి ఇగో శాటిస్‌ఫై అయి ఉంటుందంతే! ఎన్ కన్వెషన్ మీద ఆధారపడిన 350 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ 350 కుటుంబాలు ప్రభుత్వానికి ప్రతీ రోజూ శాపనార్థాలు పెడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ మంచిదా చెడ్డదా అన్నది పక్కనపెడితే, ఎన్ కన్వెన్షన్‌లో పర్మనెంట్‌గా పని చేస్తున్న 350 మందికి ఉపాధి లేకుండా పోయింది. తర్వాతర్వాత హైడ్రాకు పరిస్థితి అర్థమయ్యింది. ప్రభుత్వానికి తత్వం బోధపడింది. అనుమతులు రద్దు చేసి మరీ కూల్చేస్తామని చెప్పిన రంగనాథ్ తర్వాత అనుమతులు ఉన్న నివాసాల జోలికి వెళ్లమని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసే అధికారం తమకు ఉందని రంగనాథ్(ranganathan) అప్పట్లో చెప్పారు. హైడ్రాకు అలాంటి అధికారాలు ఎవరిచ్చారో తెలియదు. ఆ మాటే రంగనాథ్‌తో అంటే ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఇస్తుందని చెప్పారు. అప్పటికీ ఆర్డినెన్స్ రాలేదన్న విషయాన్ని గమనించాలి. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసే అధికారం ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడికి, మురళీమోహన్‌కు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు? నోటీస్ పిరియడ్ దాటినా వారి నిర్మాణాలు ఎందుకు కూల్చలేదు? ఇదే ప్రశ్న అడిగితే అర్థంపర్థం లేని సమాధానాలు ఇచ్చింది హైడ్రా. కూల్చకపోవడానికి కారణాలు ఏమైనా కానీ ప్రజలకు మాత్రం హైడ్రా పక్షపాత ధోరణిని పాటిస్తున్నదని తెలిసిపోయింది. హైడ్రా కారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆవేదన చెందారు. ఇప్పుడు హైడ్రా కొత్తగా మరో మాట చెబుతున్నది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తే, అప్పుడు అది అక్రమమో సక్రమమో చూసి కూల్చివేస్తామని చెబుతున్నది. అసలు హైడ్రా ఏం చేయదల్చుకుంది?