తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు. లడ్డూ వివాదంపై విచారణ జరగాలని మాత్రమే చాలా మంది డిమాండ్‌ చేస్తూ వచ్చారు. తిరుమలలో అపచారం జరిగిందని, లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వమే సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ ఏం తేలుస్తుంది? ఏం తేల్చాల్సిన అవసరం ఉంది? ఆల్‌రెడీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత సిట్‌ ఇందుకు భిన్నమైన విచారణ చేస్తుందా? సిట్ ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? టెండర్లు ఎలా ఇచ్చారు అన్నదానిపై విచారణ చేయాలా? లేకపోతే ఆ నాలుగు ట్యాంకర్లలో ఉన్న నెయ్యి ఏమిటన్నదానిపై విచారణ చేయాలా? పోనీ లడ్డూల క్వాలిటీ చెక్‌ చేస్తుందా అంటే ఆ లడ్డూలు ఎప్పుడో అమ్ముడయ్యి ఉంటాయి. ఇప్పుడు అవి దొరకమన్నా దొరకవు. మరి సిట్‌ ఏం విచారణ చేస్తుంది? ఆల్‌రెడీ ప్రభుత్వం ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఆధారాలను సేకరించే పనిలో పడుతుందా? ప్రభుత్వం కల్తీ జరిగిందని చెప్పింది కాబట్టి, కల్తీ జరిగిందనే ఆధారాలు తయారు చేస్తుందా? అసలు సిట్‌ ఏం విచారిస్తుంది? ఏం తేలుస్తుంది? లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ప్రభుత్వం చెప్పిన తర్వాత నిజంగానే కల్తీ నెయ్యిని వాడారా? లేదా? అన్నది సిట్‌ తేల్చాల్సి ఉంటుంది. సిట్ వేయడంలో ప్రభుత్వం ఆలోచన ఏమిటన్న సందేహం చాలా మందికి వచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలు సీఐడీ విచారణను కోరుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి. సీబీఐ విచారణ కోరుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి సంబంధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జ్‌తో విచారణ జరిపించాలంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇందుకు సంబంధించి కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఇప్పుడు సీబీఐ కానీ, సీఐడీ కానీ మరో విచారణ సంస్థ కానీ విచారణ చేయాలంటే రిజెక్ట్‌ అయిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మళ్లీ పరీక్షించాలి. వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందనే అనుమానంతో వాటిని వెనక్కి పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మరి ఆ నాలుగు ట్యాంకర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిపై అనుమానాలు ఉన్నప్పుడు వాటిని టీటీడీ అట్టే పెట్టుకోవచ్చు కదా! ఇప్పుడు ఏఆర్‌ డెయిరీపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ అంటోంది. క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఆధారాలు ఉండాలి కదా! ఆ ట్యాంకర్లే లేనప్పుడు రుజువులు ఎలా సంపాదిస్తుంది.? ఇప్పుడు టీటీడీ దగ్గర ఉన్న ఆధారాలేమిటి?

ehatv

ehatv

Next Story