గత రెండు మూడు నెలల నుంచి హైడ్రాపై తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన చర్చ సాగుతోంది.

గత రెండు మూడు నెలల నుంచి హైడ్రాపై తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన చర్చ సాగుతోంది. సినిమా హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేసిన సందర్భంగా హైడ్రాను ఓ హీరోగా తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేశారు. ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు సెలబ్రేట్‌ చేసుకున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. పరిపాలన అంటే ఇలా ఉండాలి అంటూ రేవంత్‌రెడ్డిని ఆకాశానికెత్తేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరహాలోనే తాము కూడా హైడ్రాలాంటిది తెస్తామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు మంత్రులు ప్రకటించారు. అంటే హైడ్రాకు ఆరంభ దశలో ఎంతటి పేరు వచ్చిందో అర్థమవుతోంది. అయితే రానురాను హైడ్రాకు చెందిన బుల్‌ డోజర్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైకే వెళుతున్నట్టుగా రాజకీయ వాతావరణం తోస్తున్నది. రేవంత్‌రెడ్డి సోదరుడికి సంబంధించిన ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ ఇంటిని ఇప్పటి వరకు కూల్చేయలేదు. నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌కు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారు. మురళీమోహన్‌ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. అంటే కొంత మందికి నోటీసులు ఇస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదన్న చర్చ మొదలయ్యింది. అలా హైడ్రాపై వ్యతిరేకత మొదలయ్యింది. నాగార్జునకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేశారని మీడియా అడిగిన ప్రశ్నకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ బదులిస్తూ హైడ్రా నోటీసులు ఇవ్వదని, డైరెక్ట్‌ కూల్చివేయడమేనని చెప్పారు. ఆయన కోర్టుకు వెళ్లి రిలీఫ్‌ తీసుకునే లోపే ఎన్‌ కన్వెన్షన్‌ను నేలమట్టం చేశారు. అలా చెప్పిన హైడ్రా కమిషనర్‌ ముఖ్యమంత్రి సోదరుడికి ఎలా నోటీసులు ఇచ్చింది? నోటీసులు ఇచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇంకా కూల్చివేతలు ఎందుకు జరగడం లేదు అన్న ప్రశ్నకు హైడ్రా నుంచి సమాధానం రావడం లేదు. మురళీమోహన్‌ ఎంత పెద్ద రియల్టరో అందరికీ తెలిసిన విషయమే ! ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు .. హైడ్రా కూల్చాల్సిన అవసరం లేదని, తానే కూల్చేస్తానని మురళీమోహన్‌ చెప్పారు. మరి మురళీమోహన్‌ వాటిని కూల్చేశారో లేదో తెలియదు, హైడ్రా అక్కడికి వెళ్లనే లేదు. గండిపేట పరిసర ప్రాంతాలలో బడాబాబుల ఫాం హౌజ్‌లు కట్టుకున్నారని, వారు వదిలిన డ్రైనేజ్‌ నీళ్లు మూసీలో కలుస్తున్నాయని, ఆ నీళ్లను హైదరాబాద్‌ ప్రజలు తాగాలా? తాను ఇలాంటివి సహించనని, వాటిని కూల్చివేయక తప్పదని రేవంత్‌ అన్నారు. మరి గండిపేటలోని ఫాం హౌజ్‌లు ఇప్పటికీ నిక్షేపంగానే ఉన్నాయి. ఎటొచ్చి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలపై పడ్డారు అధికారులు. అక్కడ నివాసం ఉంటున్నవారంతా దిగువ మధ్య తరగతికి చెందిన వారు. ఇప్పుడు ఆ నివాసాలను హైడ్రా కూల్చివేస్తున్నది. ఆ కూల్చివేతల తీరు కూడా విమర్శలకు కారణమవుతోంది.

Updated On 30 Sep 2024 1:20 PM GMT
ehatv

ehatv

Next Story