ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు , తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానాలో, పౌర సమాజమో దానిని అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు.
ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు , తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానాలో, పౌర సమాజమో దానిని అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. అందరూ అందర్ని వంద శాతం సంతృప్తి పరచడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాలలో నాయకులో, ప్రభుత్వాలో తప్పులు చేయవచ్చు. తప్పులు చేయడం మానవసహజం. చాలా ప్రభుత్వాలు తప్పులు చేస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు అది తప్పని మనకు ఆ సమయంలో తెలియకపోయినా ఆ తర్వాత అది తప్పని ఎవరైనా చెబితే దాన్ని సహృదయతతో స్వీకరించాలి. న్యాయస్థానాలు హితవు చెబితే పాటించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు పూర్తిగా ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. సమర్థించుకోలేని పరిస్థితిలోకి నెట్టేశాయి. సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు లడ్డూ అంశంపై వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి వరకు తెలుగుదేశంపార్టీ స్పందించలేని పరిస్థితిలో ఉంది. సుప్రీం కోర్టు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నామనో, తొందరపాటులో తమ నాయకుడు ఏదో మాట్లాడి ఉంటారనో చెబితే పోయేదేమీ ఉండేది కాదుగా! ఇంకా గౌరవం పెరుగుతుంది. కానీ ఈ పని రాజకీయ పార్టీలు చేయవు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి హయాంలో చాలా ఆలయాలు ధ్వంసం అయ్యాయంటూ టీడీపీ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. ఉద్దేశపూర్వకంగా గుళ్లను కూల్చేశారని చెబుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రథాలను తగుల పెట్టారని, దేవుళ్ల విగ్రహాలను నరికేశారని, అలాంటి జగన్‌కు మద్దతుగా కోర్టు అలా ఎలా వ్యాఖ్యానిస్తుందని టీడీపీ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. గుళ్లను కూల్చేయడం, రథాలు తగలబడిపోవడం, విగ్రహాలు నరికేయడం ఇవన్నీ జగన్ చేయించి ఉంటే, అందుకు తగిన ఆధారాలు మీ దగ్గర ఉంటే వెంటనే జగన్‌ను శిక్షించండి.. స్పష్టమైన ఆధారాలను సంపాదించి కోర్టు ముందు పెట్టండి.. అంతే తప్ప ఇప్పటికీ జగన్‌ను ఆడిపోసుకోవడం మంచిది కాదు!