Journalist YNR : చంద్రబాబు భయం, వైసీపీకి ఆనందం!
ఆంధ్రప్రదేశ్‌లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదు అంటూ ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్(AP)లో ఆరు గ్యారంటీ( 6 Guarantees )ల అమలుకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదు అంటూ ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) చెబుతూ వచ్చింది. బదులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని తెలుగుదేశంపార్టీ(TDP) చెప్పింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంటుంది. మరి ఏ రకంగా అమలు చేస్తారు? గత ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఏటా 70 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది. ఈ సంక్షేమ పథకాల కోసమే గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ ఏ శ్రీలంక(Sri Lanka)లాగానో, జింబాబ్వే(Zimbabwe)లాగానో మారిపోయిందని కూడా చెప్పింది. మరి మీరు ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారంటూ ఎన్నికలకు ముందు కొందరు ప్రశ్నించారు. దానికి ఎన్టీయే కూటమి(NDA Alliance) ఇచ్చిన జవాబు ఏమిటంటే తాము సంపద సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తామని చెబుతూ ఇంతకు మించిన సంక్షేమ పథకాల(Welfare schemes)ను అమలు చేస్తామని గట్టిగా చెప్పింది. జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నదని, ఆ అవినీతిని తాము అరిగట్టగలిగితే చాలని, బోల్డంత సంపద మిగులుతుందని టీడీపీ ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట! అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు(AP Govt Debt) చేసిందని చెప్పారు. 14 లక్షల కోట్ల రూపాయలు అంటూ ఎన్డీయే కూటమి నేతలు మాట్లాడుతూ వచ్చిన మాటలు కాస్తా గవర్నర్ స్పీచ్‌కు వచ్చేసరికి పది లక్షల కోట్లు అయ్యింది. మరోవైపు జగన్ మాత్రం ఇంచుమించు ఏడు లక్షల 98 వేల కోట్ల రూపాయల అప్పు ఉందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇది కూడా తాను చేసింది కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి వస్తున్న అప్పు అని చెప్పారు.
అసెంబ్లీలో చంద్రబాబు(Chandrababu) ఏం చెప్పారంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే భయమేస్తున్నదని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించి వెళ్లిందని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం ఎలా అన్న భయం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్టయ్యింది. వీటిని అమలు చేయడం కష్టమని తాము ముందే చెప్పామని అంటోంది.