YS Jagan Declaration Form : సంతకం పెట్టాలా? వద్దా? టీడీపీ ట్రాప్‌లో జగన్?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కాసేపట్లో తిరుమలకు(Tirumala) వెళుతున్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కాసేపట్లో తిరుమలకు(Tirumala) వెళుతున్నారు. శనివారం ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల లడ్డూ(tirumala laddu) వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో(Chandrababu) పాటు కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలతో భక్తులు ఆందోళనకు గురైన నేపథ్యంలో తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు జగన్మోహన్‌రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయాలని క్యాడర్‌కు పిలుపు ఇచ్చారు జగన్. అధికారం కోల్పోయిన తర్వాత క్యాడర్‌కు ఇచ్చిన మొదటి పిలుపుగా దీన్ని భావించాలి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి దర్శనానికి జగన్ వెళుతున్న సందర్భంగా కూటమి వైపు నుంచి ఓ డిమాండ్ వస్తున్నది. డిక్లరేషన్‌పై(Declaration) సంతకం(Signature) పెట్టిన తర్వాతే జగన్ స్వామివారిని దర్శించుకోవాలన్నది కూటమి నేతల డిమాండ్! అసలు ఏమిటీ డిక్లరేషన్. తిరుమలలో ఓ సంప్రదాయం ఉంది. అన్య మతస్థులు ఎవరైనా తిరుమలకు వెళుతున్నప్పుడు స్వామివారి పట్ల తమకు భక్తి విశ్వాసాలు ఉన్నాయన్న విషయాన్ని డిక్లరేషన్ రూపంలో ఇచ్చి దర్శనానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇస్తారా? ఇవ్వరా? అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. జగన్మోహన్‌రెడ్డి కనుక డిక్లరేషన్ ఇవ్వకుండా వెళితే కూటమి నేతలు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు లడ్డూతో జగన్‌ను ఇరుకున పెట్టగలిగిన తెలుగుదేశంపార్టీ అధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని కూడా వివాదం చేసే అవకాశం లేకపోలేదు. లడ్డూ వివాదం పక్కకువెళ్లి జగన్ క్రిస్టియన్ అని, డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్శించుకుని తిరుమల పవిత్రను దెబ్బతీశారని కూటమి నేతలు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సింహభాగం మీడియా కూటమి చెప్పుచేతల్లోనే ఉంది కాబట్టి తిరుమలలో అపరాధం జరిగిందనే ప్రచారం జోరుగా సాగవచ్చు. అసలు డిక్లరేషన్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుగా భావించరు. అన్య మతానికి చెందిన వారు కలియుగ దైవం దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన తిరుమలకు వెళ్లారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కూడా తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. ఇలా చాలా మంది డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి దర్శనానికి వెళ్లారు. అయితే డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకన్నస్వామిని దర్శించుకునే సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటంది. ప్రతిరోజు వెయ్యి మంది ఇలా డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్శించుకుంటారు. వారిని గుర్తుపట్టే వీలు ఉండదు కాబట్టి హాయిగా వెళ్లి వస్తుంటారు. ఇలా అని జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఫర్వాలేదన్నది ఉద్దేశం కాదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్‌రెడ్డి అయిదుసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. అప్పుడు కూడా తెలుగుదేశంపార్టీ నేతలు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే పట్టు వస్త్రాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కూడా ఇలాంటి డిమాండే చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇదే మాట అంటున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు తప్ప జగన్మోహన్‌రెడ్డిగా కాదు. ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ఉంటుందే తప్ప డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సీఎం కాకమునుపు రెండుసార్లు ప్రతిపక్ష నేతగా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వెళ్లారు కాబట్టి అప్పుడు కూడా డిక్లరేషన్ అవసరం పడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కూడా క్రిస్టియనే! ఆయన కూడా ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. సీఎం హోదాలో తిరుమలను దర్శించారాయన! ఎప్పుడూ లేనిది ఇప్పుడు డిక్లరేషన్ విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారంటే, ఇప్పుడు ఏపీలో కులమతాలకు చెందిన వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి డిక్లరేషన్‌పై ఇంతగా పట్టుబడుతున్నారు కూటమి నేతలు. లడ్డూ వివాదానికి సంబంధించి తమ హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెబుతూ వస్తోంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తిరుమలలో అనేక సంస్కరణలను తామే తీసుకువచ్చామని చెబుతోంది. అయినప్పటికీ లడ్డూను కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. జగన్‌ను ఎంతగా డిఫేమ్ చేయాలో అంతగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ స్వామివారిని దర్శించుకుంటే అదో వివాదంగా మారుతుంది. జగన్‌పై మరింతగా వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. శ్రీవారంటే జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని కూటమి నేతలు ప్రచారం చేస్తారు. ఇప్పుడు జగన్ చేయాల్సిందల్లా డిక్లరేషన్‌పై సంతకం పెట్టి స్వామిని దర్శించుకోవడం. దానివల్ల జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీ పన్నిన ఉచ్చులో జగన్ పడకుండా ఉండాలంటే డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. జగన్ ఏం చేస్తారో చూడాలి.