ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పార్టీలుగా విడిపోయింది. ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా హౌస్‌ ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పార్టీలుగా విడిపోయింది. ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా హౌస్‌ ఉంది. తెలుగుదేశంపార్టీకి చాలా ఉన్నాయి. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ కూడా టీడీపీకే ఎక్కువ ఉన్నాయి. వీటితోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను నడిపిస్తున్నారు. ఓ పార్టీ ప్రకటన చేస్తే చాలు, దాన్ని సమర్థించడానికి ఎక్కడి వరకైనా వెళుతున్నాయి. తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లొ కట్టేయమన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను అక్షరం పొల్లుపోకుండా తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా ప్రచురించడం ద్వారా, చంద్రబాబు ఒక్క మాటంటే దానికి వంద జతకలిపి ప్రసారం చేయడం ద్వారా కల్తీ వార్తలు రాస్తున్నారు. ఈ కల్తీ వార్తలు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులను క్షోభకు గురి చేస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు ఏదో అన్నారు కాబట్టి దాన్ని సమర్థించడం తమ బాధ్యత అన్నట్టుగా కూలీ మీడియా వ్యవహరించింది. లడ్డూ లో ఏదో కలిసిపోయిందంటూ భక్తులందరి మనసులు గాయపడేలా చేశాయి. కనీసం జరిగిందో, జరగలేదో అన్న అనుమానం కూడా లేకుండా అపచారం జరిగిందని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని రాశాయి. చంద్రబాబు భజన చేస్తూ బతికేస్తున్న కొన్ని పత్రికలు అయితే పంది మాంసం కలిసిందని, చేప మాంసం కలిపారని, గొడ్డు మాంసం కలిపేశారు వంటి అత్యంత దారుణమైన వార్తలు వండి ప్రచురించాయి. ఇలాంటి కల్తీ వార్తలను కూలీ మీడియా రాస్తూ వచ్చింది. గంటలు గంటలు డిబేట్లు పెడుతూ వచ్చాయి. జగన్‌ మీద కోపం ఉంటే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద కోపం ఉంటే, కాంగ్రెస్‌ పార్టీ మీద కోపం ఉంటే, కమ్యూనిస్టు పార్టీపైన కోపం ఉంటే రాజకీయ పరమైన విమర్శలకు పరిమితం కావాలి. అంతే కానీ భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా దేవుడితో కూడా రాజకీయం చేద్దామని భావించడం తప్పు. కనీస స్పృహ లేకుండా ఏమి రాస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఒళ్లు మరచి వార్తలు రాసిన వారికి సుప్రీం కోర్టు కర్రుకాల్చి వాత పెట్టింది. కామన్‌సెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరు అడిగిన ప్రశ్నలనే సుప్రీం కోర్టు సంధించింది.


Updated On 1 Oct 2024 10:52 AM GMT
Eha Tv

Eha Tv

Next Story