ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు(AP Assembly) వెళ్లకూడదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు(AP Assembly) వెళ్లకూడదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నిర్ణయం తీసుకుంది. కొంత మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. అసెంబ్లీకి వెళ్లకపోవడంపైన పార్టీకి చెందిన కొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. ఓ పార్టీ అధినేత అసెంబ్లీకి వెళ్లకపోవడం సరికాదని, వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని హితవు చెప్పారు. అవమానాలు ఎదురవుతాయని భయపడితే ఎలా అని జగన్‌కు సూచించారు. ఏదైతేనేమీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు వెళ్లకూడదని తీర్మానించేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 164 మంది శాసనసభ్యులతో అధికారంలోకి వచ్చిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, కూటమికి సంబంధించిన నేతలకు, ముఖ్యులకు కూడా వైసీపీ అసెంబ్లీకి రాకపోవడమన్నది తీవ్ర నిరాశ కలిగించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి హాజరవుతే ర్యాగింగ్ చేద్దామని ఆలొచనలో కూటమి ఎమ్మెల్యేలు ఉండటం సహజం. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన ఎమ్మెల్యేలను ర్యాగింగ్ చేయడమో, విమర్శలు చేయడమో, హేళనగా మాట్లాడటమో మనం చూశాం. అధికారపక్ష ఎమ్మెల్యేలు విపక్ష పార్టీలకు చెందిన వారిపై ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ ఉండేదే! అసెంబ్లీకి జగన్ వస్తే ర్యాగింగ్ చేద్దామనుకున్న కూటమి నేతలకు జగన్ నేతృత్యంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడమన్నది నిరాశ కలిగించిన మాట వాస్తవం. అందుకే వారు పదే పదే జగన్‌ను అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతున్నారు. అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందనే హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయితే అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో జరుగుతున్న అంశాలపట్ల తాను రెండు రోజులకోసారి మీడియా ముందుకొస్తానంటూ జగన్మోహన్‌రెడ్డి గతంలో చెప్పారు. చెప్పినట్టుగానే జగన్ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అప్పుల విషయంపైనా, వాలంటీర్ల విషయంపైనా, ఇంకా రకరకాల అంశాలపైనా జగన్ స్పందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ వెలుపల నుంచే కూటమి నేతలను ర్యాగింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలు విన్నవారికి కూటమి నేతలను మాస్ ర్యాగింగ్ చేసినట్టు అనిపించింది. అసెంబ్లీకి వెళ్లి ర్యాగింగ్‌కు గురి అవ్వకుండా రివర్స్‌గా కూటమి నేతలనే ఆయన ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. జగన్ వస్తే ఏదో అనేద్దాం.. హేళన చేద్దాం.. మాట్లాడనివ్వకుండా చేద్దాం అనుకున్నవారికి జగన్ నుంచి రివర్స్ పంచులు పడ్డాయి. అప్పులకు(AP Debts) సంబంధించిన విషయంపై జగన్ చాలా డిటైల్డ్‌గా మాట్లాడారు. అప్పులనేవి నిరంతర ప్రక్రియ అని, చంద్రబాబు గద్దెదిగి పోవడానికి ముందు కూడా ఏపీ అప్పులు 40 వేల కోట్ల రూపాయలు ఉండిందని జగన్ చెప్పారు. పైగా చాలా బిల్లలు పెండింగ్‌పెట్టి వెళ్లారని, వాటన్నింటినీ తాము చెల్లించాల్సి వచ్చిందని జగన్ తెలిపారు. అప్పులకు సంబంధించి ఓ ప్రణాళికబద్దంగా, ఆర్గనైజింగ్‌గా తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీ(Janasena), బీజేపీ(BJP), టీడీపీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చాయి. 14 లక్షల కోట్లు అంటూ పదే పదే చెబుతూ వచ్చాయి. కొందరైతే ఇప్పటికీ 14 లక్షల కోట్లు అని తేలిందని, ఇంకా ఎంతుంటుందోనని అన్నారు. అయితే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సందర్భంగా కాగ్ నివేదికల ప్రకారం అప్పులు చూస్తే ఆరు, ఏడు లక్షల కోట్ల కంటే ఎక్కవ లేవు. కాగ్ రిపోర్ట్‌ను కూడా దాచేసి ఇంకా అప్పులు తెచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అధికారంలో రానప్పుడు, అధికారంలో లేనప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ కరాఖండిగా బల్లగుద్ది రాష్ట్ర ప్రజలకు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి అయిదు నెలలు గడిచిన తర్వాత తాము తవ్వకాలు చేపడుతున్నామని, తవ్వకాలలో ఇప్పటి వరకు తేలింది ఏడు లక్షల కోట్లు అని చెబితే ఎలా? మీరు అధికారంలో ఉండి తవ్వితేనే ఏడు లక్షల కోట్లు అని తేలితే, అధికారంలో లేనప్పుడు 14 లక్షల కోట్లు అని దేన్ని బేస్ చేసుకుని చెప్పారు? అంటూ జగన్ కచ్చితమైన లెక్కలతో కూటమి నేతలను కడిగి పారేశారు. ఓ రకంగా ర్యాగింగ్ చేశారు. దాంతో పాటు కేసులకు సంబంధించిన అంశంపై కూడా జగన్ మాట్లాడారు.