ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) జనంలోకి రాబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) జనంలోకి రాబోతున్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజల్లోకి రావాలని ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అధికారంలో ఉన్న అయిదు సంవత్సరాల పాటు ఆయన కార్యకర్తలకు దూరమయ్యారు. కార్యకర్తలకు దూరంగా ఉన్నారనే భావన ఆ పార్టీ క్యాడర్‌లో ఉంది. కార్యకర్తలకు దూరంగా ఉండటం వల్ల ఆయనకు గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు. ఇంట్లో ఉంటూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, కోటరితో ముచ్చటించే జగన్‌కు తెలిసే అవకాశం కూడా లేదు. గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఈ స్థాయిలో పరాజయంపాలు కావాల్సి వచ్చిందంటూ జగన్ అభిమానులు అంటున్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజలను కలవనియ్యకుండా కొంతమంది అడ్డుతగిలారని అంటున్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar reddy) ఉన్న సమయానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ఉన్న సమయాన్ని చాలా మంది కంపేర్ చేస్తూ ఉంటారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి రోజు ఉదయం ఆయన ప్రజలను కలిసేవారు. ప్రజలు ఆయనను నేరుగా కలిసి సమస్యలపైన వినతి పత్రాలు ఇచ్చేవారు. సుమారు గంటపాటు వైఎస్‌ఆర్ ప్రజలతో మమేకం అయ్యేవారు. క్యాంప్ ఆఫీసు నుంచి సెక్రటేరియట్ వెళ్లడానికి ముందు అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకుని, వాటికి సంబంధించిన కరెస్పాండెన్స్ కూడా చేసేవారు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ప్రతి రోజు ఓ గంట సమయాన్ని కేటాయించేవారు. అయితే ఈ మెకానిజం జగన్మోహన్‌రెడ్డి దగ్గర మిస్సయ్యిందంటూ పాత కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చెబుతుంటారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటివి చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యారు అని కూడా అంటుంటారు. ఇప్పుడు జగన్‌కు తత్వం బోధపడటం వల్లనో, సీనియర్ నేతలకు సంతృప్తి కలిగించాలన్న ఉద్దేశం వల్లనో, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసమో ప్రజల చెంతకు రావాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇంత దారుణమైన ఓటమికి కారణాలేమిటో స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు జగన్. ఆ విషయాలు తెసుకున్న తర్వాత ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.