YS Jagan Assembly Disqualification : జగన్మోహన్రెడ్డిపై అనర్హత వేటు?
ఆంధప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan mohan reddy) కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు
ఆంధప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan mohan reddy) కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనతో పాటు మరో పది మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా(Opposition) ఉండాలంటే మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో పది శాతం ఉండాలి. అంటే కనీసం 18 మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తాము తప్ప మరెవ్వరూ ప్రతిపక్షంలో లేరు కాబట్టి తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని అంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. పది శాతం సభ్యులు అవసరం లేదని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ఈ విషయంపై జగన్ న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. కోర్టు స్పీకర్‌కు నోటీసు ఇచ్చింది. ఇప్పటి వరకు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే కోర్టు తీర్పు కూడా ఆలస్యమవుతోంది. ఈ అంశానికి సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండానే సమావేశాలు జరుగుతున్నప్పుడు బయట నుంచే చెప్పదల్చుకున్న చెబుతానని జగన్ అంటున్నారు. రెండు మూడు రోజులకోసారి విలేకరుల సమావేశం పెట్టి ప్రజా సమస్యలపైన, అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలపైనా ప్రజలను వివరంగా చెబుతానని జగన్ అన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లను పెట్టారు. అసెంబ్లీకి జగన్మోహన్‌రెడ్డి వెళ్లకపోవడమనేది రాజకీయంగా ఆయనకు నష్టం కలిగిస్తుందా? లాభం కలిగిస్తుందా? అన్న విషయాలు పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం మాత్రం కూటమి నేతలకు తీవ్రమైన నిరాశను కలిగిస్తున్నదన్నది మాత్రం నిజం! అసెంబ్లీ ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని అందుకుని ప్రభత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమికి జగన్ మాటలు నిస్పృహను కలిగిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం పెద్దగా లేకపోవడ కూటమి నేతలకు కిక్కు ఇవ్వడం లేదు. జగన్ అసెంబ్లీకి రావాలి అంటూ వారు డిమాండ్ చేయడాన్ని కూడా చూస్తున్నాం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా జగన్ సభకు రావాలని అంటున్నారు. ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజుల నుంచి తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా జగన్‌పై అనర్హత వేటు వేయనున్నారంటూ వార్తలు రాస్తూ వస్తున్నది. శాసనసభ వ్యవహారాల విషయంలో ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఇప్పటి వరకు సభకు హాజరుకాలేదని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాలలో సభకు వెళ్లని వారి గురించి తెలుసు కానీ వెళ్లకపోతే అనర్హత వేటు వేసిన సంఘటనలు లేనే లేవు.