Chandrababu : చంద్రబాబు,నరేంద్రమోదీ మాస్టర్ ప్లాన్
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ(TDP) ఉందా?
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ(TDP) ఉందా? అంపశయ్య మీద ఉన్న ఆ పార్టీ ఊపిలూదుకుని తిరిగి లేస్తుందా? పూర్వవైభవం సాధ్యమవుతుందా? అసలు ఆ పార్టీకి భవిష్యత్తు ఉందా? ఈ ప్రశ్నలు తెలుగుదేశంపార్టీని అభిమానించే వారిని అడిగినా .. అంత ఆశ లేదని జవాబు చెబుతారు. ఏదో తెలంగాణలో(Telangana) టీడీపీ శాఖ ఉంది కాబట్టి అలా నడుపుకుంటూ వస్తున్నారు. పైగా హైదరాబాద్‌లో ఆ పార్టీకి ఓ పెద్ద ఆఫీసు కూడా ఉంది. ఒకరిద్దరు ఇప్పటికీ ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి బేస్ ఉంది కానీ ఆదరణ కనిపించడం లేదు. ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితిలోకి ఆ పార్టీ వెళ్లిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయలేదన్న సంగతి తెలిసిందే. పోటీ చేయకుండా ఉండటమే కాదు, ఎవరికి ఓటు వేయాలో కూడా చెప్పలేని పరిస్థితికి పార్టీ నాయకత్వం వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న టీడీపీకి తెలంగాణలో మళ్లీ జీవం పోయడానికి ప్రయత్నాలు చాలా సీరియస్‌గా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. గతంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ తెలుగుదేశంపార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. సోమవారం జరిగిన పరిణామాలు చూస్తుంటే అది నిజం కాబోతున్నట్టుగా అనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) టార్గెట్ అంతా మల్లారెడ్డిపైనే ఉంది. మల్లారెడ్డి అనేక అక్రమాలు చేశారని, వందలకొద్ది ఎకరాల భూములను కబ్జా చేశారని ముఖ్యమంత్రి కావడానికి ముందు నుంచే రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. అందుకు తగిన ఆధారాలను చూపించారు. దీనిపై విచారణ జరిగిందో లేదో తెలియదు కానీ, తాజాగా బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు జనార్దన్‌రెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును(Chandrababu) కలిశారు. తీగల కృష్ణారెడ్డి గతంలో హైదరాబాద్‌కు మేయర్‌గా పని చేశారు. చంద్రబాబును కలవడానికి కారణం తన మనవరాలి పెళ్లి కార్డు ఇవ్వడం కోసమేనని మల్లారెడ్డి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా తెలంగాణలో తెలుగుదేశంపార్టీని బతికించుకునే ప్రయత్నం జరుగతున్నది. హైదరాబాద్‌లో తెలుగుదేశంపార్టీకి ఇప్పటికీ ఓటు బ్యాంకు ఉందంటూ ఆ పార్టీ నమ్ముతోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులు ఉన్నారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా చాన్నాళ్లుగా తెలంగాణలో పాగా వేయాలని అనుకుంటోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ మాగ్జిమమ్ ఎఫర్ట్ పెట్టింది. ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలనే ఆ పార్టీ గెల్చుకుంది. జీహెచ్‌ఎంసీలో వచ్చిన ఓట్లను చూసి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదనే ఓ ఇంప్రెషన్ వచ్చింది. ఎన్నికలకు మందు పార్టీ అధ్యక్షుడి మార్పు, అప్పుడు జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. వర్తమానానికి వస్తే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేంద్రంలో కూడా ఎన్టీయే కూటమినే అధికారంలో ఉంది. మరి తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసే ఉన్నాయా అంటే జవాబు చెప్పడం కష్టమే. అయితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి వెళ్లి చంద్రబాబును కలిశారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి హైదరాబాద్‌లో పాగా వేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు.