నటి పూనమ్ కౌర్(Poonam kaur) చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది.
నటి పూనమ్ కౌర్(Poonam kaur) చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. కొంతకాలంగా ఆమె చేస్తున్న ట్వీట్లు రకరకాల రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్(Trivikram) టార్గెట్‌గా గతంలో ఆమె అనేక ట్వీట్లు చేశారు. అవన్నీ పరోక్షంగానే ఉన్నాయి. పవన్ కల్యాణ్(Pawan kalyan) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు రకరకాల ట్వీట్లు చేస్తూ వచ్చారు పూనమ్ కౌర్. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడు పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో రియాక్టవుతూ వచ్చారు. ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన అంశం మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికపరమైన దాడులు, ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ(Justice Hema Committiee) ఇచ్చిన నివేదిక. ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు తమ చేదు అనుభవాలను బహిరంగ పరిచారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనాలకు కారణమయ్యింది. ప్రముఖ నటులపై కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన సహాయకురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ అసలు స్వరూపం బయటకు వచ్చింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్(Jani Master) జనసేన(Janasena) పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. జానీ మాస్టర్‌పై ఆరోపణలు రావడంతో జనసేన అధినాయకత్వం అతడిని పార్టీకి దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. ఈ విషయం సాగుతున్న క్రమంలోనే తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరిపైన అయినా లైంగిక దాడులు జరిగితే వారు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఫిర్యాదు చేయవచ్చని టీఎఫ్‌సీసీ తెలిపింది. ఇప్పటి వరకు లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు తీసుకోవడం, వాటిపై యాక్షన్ తీసుకోవడం వంటి వాటిపై ఓ ప్రొసీజర్ అంటూ లేదని చెబుతూ ఇక ముందు సీరియస్ యాక్షన్ ఉంటుందని టీఎఫ్‌సీసీ(TFCC) సభ్యులు చెప్పారు. ఇది జరిగిన కొద్ది సేపటికే పూనమ్ కౌర్ మరో ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. త్రివిక్రమ్‌పైన తాను గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని, వారు అసలు తన కంప్లయింట్‌ను పట్టించుకోలేదని పూనమ్ కౌర్ ఆరోపిస్తున్నారు. తాను త్రివిక్రమ్‌పైన ఫిర్యాదు చేసిన వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విచారించి ఉన్నట్లయితే ఈరోజు సినిమా పరిశ్రమలో ఈ తరహా లైంగికదాడులు ఉండేవి కావని, తనలాగా మరొకరు ఇబ్బందులు పడేవారు కాదని ఆమె చెప్పారు. అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ త్రివిక్రమ్‌ను వదిలేసింది కాబట్టే ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయని తెలిపింది. తాను 'మా'కు ఫిర్యాదు చేయడం వల్ల తనకు న్యాయం జరగకపోగా, అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఈ విషయంపై ప్రశ్నించాలని పూనమ్ కౌర్ అంటున్నారు.