Konda Surekha : ఛీ.. ఛీ... బాధ్యత లేని విమర్శలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda surekha) చేసిన వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయలను(Telangana politics) కుదిపేస్తున్నది
తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda surekha) చేసిన వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయలను(Telangana politics) కుదిపేస్తున్నది. ఆమె చేసిన వ్యాఖ్యలను రాయడానికి కూడా చేతులు రావడం లేదు. చెప్పడానికి మాటలు రావడం లేదు. అంత నీచంగా ఆమె మాట్లాడారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం, ఆమె ఈ వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితికి కారణం బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అంటూ కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలయ్యిందో చూద్దాం. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఆ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా మెదక్ ఎంపీగా ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకుడు రఘునందనరావు ఆమెకు నూలుపోగుతో కూడిన ఒక దండను వేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయండి అని అడిగే క్రమంలో సింబాలిక్‌గా అక్క మీకు ఈ దండ వేస్తాను అని అడిగి నేను ఆమెకు ఆ దండ వేశానంటూ రఘునందనరావు చెబుతున్నారు. ఆ దండ వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో కొంతమంది వీళ్లకు కల్యాణలక్ష్మి డబ్బులు ఎప్పుడిస్తారు? అంటూ ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టు వెనుక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు ఉన్నారన్నది కొండా సురేఖ ఆరోపణ. ఈ అంశంపై కొండా సురేఖ గాంధీభవన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రంతా తాను నిద్రపోలేదని, భోజనం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మానసిక క్షోభను అనుభవించాను అని అన్నారు. రాజకీయాలలో ఉన్నందుకు ఇలా మహిళలను ఏడిపిస్తారా? మహిళలు అంటే గౌరవం లేదా? బీఆర్‌ఎస్ ఈ రకమైన నీచ రాజకీయాలను ఎందుకు చేస్తున్నది అంటూ కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత ఆ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ నేత హరీశ్‌రావు ఈ అంశాన్ని ఖండించారు. కొండా సురేఖ పట్ల ఆ తరహా పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని కూడా హరీశ్‌రావు చెప్పారు. ఈ తర్వాత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు కొండా సురేఖ రియాక్టయ్యారు. 'ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఇంతకంటే దారుణమైన భాషను మాపైనా, మా కుటుంబసభ్యులపైనా మాట్లాడారు. అప్పుడు మా కుటుంబం కూడా బాధపడి ఉంటాం కదా? మా కుటుంబసభ్యులపై ఈ తరహా ట్రోల్స్‌ను చాలా చేశారు కదా! రేవంత్‌రెడ్డి నోటిని ఫినాయిల్‌తో కడగాలి. కొండా సురేఖ ఇది చూసుకుంటే మంచిది. గతంలో సీతక్కను హామీల విషయాన్ని అడిగితే నోటికొచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లవి దొంగ ఏడుపులు' అని కేటీఆర్ అన్నారు. ఈ మాటలేమీ మీడియా ముందు ఆయన మాట్లాడలేదు. చిట్‌చాట్‌లో అన్న మాటలని మీడియా మిత్రులే చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడామె మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆమె ఈ తరహా మాటలు మాట్లాడతారని ఎవరూ ఊహించి ఉండరు. ఆమెకు కోపం కేటీఆర్‌పైన కాబట్టి కేటీఆర్‌ను ఎంతైనా తిట్టుకోవచ్చు. కానీ మధ్యలో ఇతరులను ఎందుకు తీసుకొచ్చినట్టు? సమంత(Samantha), నాగార్జున(Nagarjuna), నాగ చైతన్య(Nagarjuna) ప్రస్తావన ఎందుకు వచ్చింది? అక్కినేని కుటుంబంపై అడ్డమైన మాటలు మాట్లాడటం అన్యాయం కదా! కేటీఆర్‌ను విమర్శించాలంటే ఇలాగనా? కేటీఆర్‌ను టార్గెట్ చేయానుకుంటే రాజకీయపరమైన విమర్శలు చేయవచ్చు. మధ్యలో వేరే వ్యక్తులు ఎందుకొస్తారు. కేటీఆర్ పదేళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నారు. మంత్రిగా ఉన్నారు. ఆయన అనేక అక్రమాలు చేశారు. దోచేశారు అంటూ కాంగ్రెస్‌పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. వాటిని రుజువు చేసి కేటీఆర్‌ను శిక్షించండి. కేటీఆర్ చేసిన దోపిడీ ఏమిటో తెలంగాణ ప్రజల ముందు ఉంచండి. కానీ ఇలాంటి ఆరోపణ ఏమిటి? నిజానికి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ సానుభూతి పరులు ఏదో పోస్టు పెట్టినప్పుడు హరీశ్‌రావు తరహాలో కేటీఆర్ కూడా రియాక్ట్ అయితే బాగుండేది. అక్కడితో ఈ వివాదం ముగిసిపోయేది. తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం, వాటికి కొండా సురేఖ ఈ స్థాయిలో రెచ్చిపోవడం సరికాదు. పైగా ఓ మహిళపై నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయడం పెద్ద తప్పు. పైగా కొండా సురేఖ ఆరోపణలు ఎలా చేస్తారు? ఆమె ప్రభుత్వంలో ఉన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్నారు. ఆరోపణలు చేసే బదులు రుజువు చేయండి. రాజకీయ పార్టీల గొడవ మధ్యన మూడో వ్యక్తిని లాగి కొండా సురేఖ సరిదిద్దుకోలేని తప్పును చేశారు. ఆమె స్థాయిని దిగజార్చుకున్నారు.