ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Heavy rains), వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Heavy rains), వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రధానంగా విజయవాడ(Vijayawada) నగరానికి సంబంధించి లక్షలాది మంది ప్రజలు రెండుమూడు రోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇళ్లల్లో మొదటి అంతస్తు వరకు నీరు వచ్చేసింది. అక్కడికి వెళ్లి సాయం అందించడం కూడా అధికారులకు కష్టంగా ఉంది. అధికార యంత్రాంగం అక్కడికి వెళ్లలేని పరిస్థితి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన బృందాలు పడవులలో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్లలోనో, పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నవారు టెర్రాస్ మీద ఉంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఫోన్‌లలో చార్జింగ్ అయిపోయింది. సాయం కోసం ఫోన్ చేసి అడుగుదామనుకున్నా సాధ్యపడటం లేదు. మొబైల్ ఛార్జ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లో కరెంట్ లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అన్నం వండుకునే అవకాశం కూడా లేదు. ఇలా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనం ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కావొచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) కావొచ్చు నేరుగా రాత్రింబవళ్లు ప్రజల దగ్గరే ఉండి , వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. మానటరింగ్ చేస్తున్నామంటున్నారు. అయితే ఈ మానటరింగ్ అంతా రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో వరద రాబోతున్నది, వస్తే పరిస్థితి ఏమిటి? బాధితులను తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? ఆహారం, నిత్యావసరాల వస్తువుల పంపిణీకి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి, అక్కడ ఉన్న నీటిని డ్రైన్ చేయడానికి ఏం చేయాలి? అన్న విషయాలపై మానటరింగ్ చేయాలి. సాధారణంగా పాలక పక్షం చేసేది కూడా ఇదే! ముందు వరద నీరు పూర్తిగా తొలగిపోవాలి. తర్వాత ప్రజలకు చేయాల్సింది చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలి. పై నుంచి వచ్చే వరద నీటిని ఆపలేం కాబట్టి వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటానికి ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెడతాయి. వరదలు వస్తాయని ముందుగానే తెలిసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ వారికి కావాల్సిన సౌకర్యాలను అందచేస్తారు. ఎవరింట్లో వారు ఉంటే వారి దగ్గరకు వెళ్లి నీరు, ఆహారం ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి అందరిని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అయితే ఈసారి వరద భయంకరంగా వచ్చింది. మునుపు ఎన్నడూ వరద నీటిని చూసి ఉండని ప్రాంతాలు కూడా ఇప్పుడు నీట మునిగాయి. మూడున్నర లక్షల మందికిపైగా ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సాయం అందించడానికి అవసరమైన మెకానిజం ఇప్పుడైతే లేదు కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండేవాడు. ఆ 50 ఇళ్లల్లో ఎవరున్నారు? వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి? ఆ వాలంటీర్(Volunteers) ద్వారా తెలుసుకునే వీలు చిక్కుతుంది. ఆహారాన్ని అందించడం కావొచ్చు. వాళ్ల అవసరాలను తీర్చడం కావొచ్చు. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఉపయోగించుకుని ఉంటే మరింత ఎక్కువగా సేవలు అంది ఉండేవి. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఏం జరుగుతున్నదో ఈ వీడియోలో చూద్దాం.