తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(Revnath reddy) కుట్ర జరుగుతోందా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(Revnath reddy) కుట్ర జరుగుతోందా? రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీ(Delhi) పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ వెనుక ఉన్నది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వెళుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా రకరకాల మీడియాలలో వార్తలు వస్తున్నాయి. వాటిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని నిరాధారమైన వార్తలుగానే చూడాలి అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతుంటారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కావొచ్చు, ప్రస్తుతం తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లడమన్నది సర్వ సాధారణ విషయంగానే చూడాలి. ఇలాంటి సాధారణ విషయమే తెలంగాణ రాజకీయాలలో(TS Politics) జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు వెళుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారనే చర్చకు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని ఫీలర్స్‌గా కనిపిస్తున్నాయి. కేవీపీ రామచంద్రరావు వంటి వారు అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌజ్ కూల్చాల్సిన అవసరం లేదా? అని రేవంత్ అంటున్నారు. కేవీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి(Rajashekar reddy) హయాంలో పార్టీలో కీలకమైన నేతగా వెలుగొందారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను తన కనుసన్నలలో జరిగేట్టు చేసుకున్నారు. అలాంటి కీలకమైన నేతపై ఎన్నికల కంటే ముందు కూడా రేవంత్‌రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాలలో ఆయన ప్రమేయమేమిటని ప్రశ్నించారు. తెలంగాణకు అలాంటివారు అవసరం లేదంటూ కామెంట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) అధికారంలోకి వచ్చిన తర్వాత కేవీపీపై నజరేసి పెట్టారు రేవంత్‌రెడ్డి. గురువారం ఓ మీటింగ్‌లో సందర్భం లేకపోయినా కేవీపీ గురించి మాట్లాడారు రేవంత్. అంటే ప్రస్తుతం ఢిల్లీకి తనకు వ్యతిరేకంగా వెళుతున్న ఫిర్యాదుల వెనుక కేవీపీ ఉన్నారని రేవంత్ అనుమానిస్తున్నారేమో! ఢిల్లీ పెద్దల దగ్గర కేవీపీకి మంచి గుర్తింపు ఉంది. ఆయన ద్వారా తెలంగాణకు చెందిన కొందరు నేతలు అధిష్టానికి కంప్లయింట్ చేస్తున్నారని రేవంత్ గట్టిగా అనుమానిస్తున్నారు. కేవీపీని రేవంత్ టార్గెట్ చేశారు అంటే, తన వెనుక గోతులు తవ్వుతున్నారని భావిస్తున్నారేమో! తెలంగాణకు సంబంధించి చాలా మంది నేతలు రేవంత్‌పై ఢిల్లీకి ఫిర్యాదు చేస్తున్న మాట మాత్రం వాస్తవం. తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో కీలకంగా ఉండే ఓ యువ నేత రేవంత్‌పై ఫిర్యాదు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అదే విధంగా రేవంత్ క్యాబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు కూడా రేవంత్ వ్యవహరిస్తున్న తీరును అధిష్టానం దగ్గర ఏకరువు పెట్టుకున్నారట! ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఒకరిద్దరు నాయకులు కూడా అధిష్టానానికి రేవంత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారని వినికిడి.