రాజకీయాలలో, రాజకీయపార్టీల నాయకులలో సిగ్గు అనే ప్రస్తావనకు అసలు అర్థముందా?

రాజకీయాలలో, రాజకీయపార్టీల నాయకులలో సిగ్గు అనే ప్రస్తావనకు అసలు అర్థముందా? రాజకీయ నాయకులకు సిగ్గుందా? సిగ్గుతో రాజకీయనాయకులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందా? సిగ్గుతో రాజకీయ నాయకులు పని చేస్తున్నారని అనుకుంటే అది పొరపాటే! ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు(AP Politics) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara chandrababu naidu) కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి(YS Jagan mohan reddy) తీరు చూస్తే ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం తనకు సిగ్గుగా ఉందని, సిగ్గేస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సిగ్గుపడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఉన్నాయా? ముందుగా జగన్మోహన్‌రెడ్డి గురించి ప్రస్తావించుకుందాం! జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల కంటే ముందు మద్యపానాన్ని కచ్చితంగా దశలవారీగా నియంత్రిస్తాను, ప్రతి ఏటా 25 శాతం చొప్పున మద్యపాన నిషేధాన్ని అమలు చేసుకుంటూ పోతానని, అయిదేళ్లలో, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యపానం ఉండదని, కేవలం ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఇంకెక్కడా ఉండదని చెప్పుకొచ్చారు. కానీ మద్యపానంపై వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్లారు. షాపులు తగ్గిస్తూ వచ్చామని చెప్పారు కానీ ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్‌ అమలు అంశంపైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అది అమలు చేయలేదు. ఎందుకు చేయలేదంటే అవగాహన లేకుండా ఆ సమయంలో హామీ ఇచ్చామంటూ జవాబిస్తున్నారు జగన్‌. చెప్పిన మాట అమలు చేయకుండా మళ్లీ జనాల దగ్గరకు వెళ్లడానికి రాజకీయపార్టీలకు సిగ్గు ఉండాలి కదా! ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగులను ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలి కదా! మద్యపాన(alcohol) నిషేధం అమలు హామీ ఇచ్చి, దాన్ని నెరవేర్చకుండా మళ్లీ మహిళల దగ్గరకు వెళ్లి ఓటు వేయండి అని అడగడానికి జగన్‌కు సిగ్గు ఉండాలి కదా! ఇది ప్రజలకు నచ్చకే అధికారంలోకి దింపేశారని అనుకోవాలి. సరే, ఇప్పుడు చంద్రబాబునాయుడు విషయానికి వద్దాం. చంద్రబాబు సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నారా? చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌.టి.రామారావు(Sr NTR) తెలుగుదేశంపార్టీని(TDP) స్ధాపించారు. అప్పుడు హైకమాండ్‌ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై పోటీ చేసి, ఆయనను ఓడిస్తానని అన్నారు. మామపై విజయం సాధిస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌కు రాజకీయాలు చేతకావని విమర్శించారు. రంగులు పూసుకునే వారికి రాజకీయాలు ఎందుకు అని ఈసడించుకున్నారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. తెలుగుదేశంపార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాలేదు, కాంగ్రెస్‌ నుంచి పెట్టాబేడా సర్దుకుని మామ చెంతకు వచ్చి చేరారు. నిజానికి ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఇది సిగ్గుపడే నిర్ణయమే కదా! తర్వాత చంద్రబాబు తెలుగుదేశంపార్టీని టేకోవర్‌ చేశారు. పార్టీలో సమున్నత స్థానాలను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ నుంచి పార్టీని గుంజేసుకున్నారు. పిల్లనిచ్చిన మామ, రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన మామ దగ్గర నుంచి పార్టీని లాక్కోవడానికి సిగ్గుండాలి కదా కచ్చితంగా! అది లేదు కాబట్టే పార్టీని లాగేసుకుని, మామను సీఎం పదవి నుంచి దింపేశారు. ఆ సమయంలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ మాట్లాడిన మాటలేమిటి? చంద్రబాబును దశమగ్రహం అన్నారు. ఔరంగజేబు కంటే హీనుడన్నాడు. నయవంచకుడని తిట్టారు. ఇంకా చాలా చాలా అన్నారు. ఈ మాటలు విన్నప్పుడైనా చంద్రబాబు సిగ్గుపడాలి కదా! అప్పుడాయన సిగ్గుపడినట్టు ఎక్కడా కనిపించలేదు. 1994లో ఎన్టీఆర్‌ అధికారంలోకి రావడానికి రెండు ప్రధాన హామీలు. ఒకటి రెండు రూపాయలకు కిలో బియ్యం. రెండోది మద్యపాన నిషేధం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దింపి, అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు ఈ రెండు పథకాలకు మంగళం పాడారు. కిలో రెండు రూపాయలు ఉన్న బియ్యాన్ని 5.35 రూపాయలు చేశారు. అప్పుడైనా సిగ్గుపడాలి కదా! చంద్రబాబు పడలేదు. నరేంద్రమోదీ(Narendra modi) గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని నరమేథం జరిగింది. ఈ దారుణాలకు నరేంద్రమోదీనే కారణమన్నారు చంద్రబాబు. మోదీని హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వనని ప్రతినబూనారు. ఆ తర్వాత నరేంద్రమోదీతో కలిసి పని చేశారు. అప్పుడు చంద్రబాబు సిగ్గుపడ్డారా? లేదు కదా! 2014లో నరేంద్రమోదీతో కలిసి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తీసుకొస్తామని ఊరువాడా తిరిగి చెప్పారు. అయిదేళ్లు కాదు, పదేళ్లపాటు హోదా తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత ప్రత్యేకహోదాను తీసుకురాలేదు చంద్రబాబు. ప్రత్యేక హోదా సర్వరోగ నివారిణి కాదని, ప్రత్యేక ప్యాకేజి రాష్ట్రానికి చాలని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని అధికారంలోకి వచ్చి, హోదా సర్వరోగ నివారిణి కాదని అంటున్నప్పుడైనా చంద్రబాబు సిగ్గుపడాలి. అప్పుడు కూడా ఆయన కొంచెం కూడా సిగ్గుపడలేదు. అదే చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదాను నెత్తికెక్కించుకున్నారు. మోదీని బండబూతులు తిట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వనందుకే తాను బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నానని చెప్పారు. ప్రజా ధనంతో రాష్ట్రమంతటా దీక్షలు చేశారు. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు సిగ్గుపడతారేమోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూశారు. అప్పుడు కూడా సిగ్గుపడలేదు చంద్రబాబు. అమిత్‌ షా కుటుంబ సమేతంగా తిరుమలకు వస్తే ఆయనపై రాళ్లు వేయించారు. ఆ తర్వాత ఇదే అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం రోజుల తరబడి ఎదురుచూశారు. అలా ఎదురుచూడటానికి కూడా చంద్రబాబు ఎక్కడా సిగ్గుపడలేదు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను చంద్రబాబు ఒక్క మాట కూడా అనలేదు. బీజేపీ పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షణాలు చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు సిగ్గుపడలేదు. 2024 ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. అప్పుడైన బాబు సిగ్గుపడ్డారా అంటే లేదనే చెప్పాలి. బీజేపీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి మళ్లీ అదే పార్టీతో జతకట్టినప్పుడు చంద్రబాబు సిగ్గుపడలేదు. 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను అనరాని మాటలన్నీ అన్నారు చంద్రబాబు. పవన్‌ కల్యాణ్‌ క్యారెక్టర్‌ను చంపేట్టుగా సోషల్ మీడియాలో అడ్డమైన రాతలు రాయించారు. పవన్‌ కుటుంబసభ్యులపై కూడా విమర్శలు చేయించారు. మళ్లీ అదే పవన్‌తో చేతులు కలిపినప్పుడైనా చంద్రబాబు సిగ్గుపడాలి కదా! 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి ఏర్పడింది. ఇందులో టీడీపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్‌ఎస్‌ ఉన్నాయి. అప్పుడు ప్రత్యేక తెలంగాణకు చంద్రబాబు జైకొట్టారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పారు. 2009లో ప్రత్యేక తెలంగాణ ప్రకటన రాగానే చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. అలా ఎలా తెలంగాణ ఇస్తారంటూ నానా యాగీ చేశారు. తనవాళ్లతో రాజీనామాలు చేయించారు. కాంగ్రెస్‌ నాయకులతో చేయించారు. ఏపీలో అప్పుడు జరిగిన ఈ నాటకంలో ప్రధానపాత్రధారి చంద్రబాబేనన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని చెప్పి, తెలంగాణ ఇస్తే అలా ఎలా ఇస్తారని అన్నప్పుడైనా చంద్రబాబు సిగ్గుపడాలి. కానీ అప్పుడు కూడా చంద్రబాబు కొంచెం కూడా సిగ్గుపడలేదు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు 'దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా' అని వ్యాఖ్యానించారు. ఈ మాట అన్న చంద్రబాబు మళ్లీ దళితుల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగడానికి ఎక్కడా సిగ్గుపడలేదు. బీసీల తోకలు కత్తిరిస్తామని అన్న చంద్రబాబే బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కూడా సిగ్గుపడలేదు. హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి, తర్వాత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకుండా మంత్రి పదవి ఊడేట్టుగా చేసినప్పుడు చంద్రబాబు సిగ్గుపడలేదు. 2009 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ జూనియర్‌ ఎన్టీఆర్‌ను తర్వాత పక్కన పెట్టేసినప్పుడు కూడా చంద్రబాబు కొంచెం కూడా సిగ్గుపడలేదు. ఇలా అనేక సార్లు చంద్రబాబు సిగ్గుపడే సందర్భాలు వచ్చినా ఆయన సిగ్గుపడలేదు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కారణంగా రాజకీయాల్లో ఉండవలసి వస్తున్నందుకు సిగ్గు వేస్తుందని అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విన్నవారు సిగ్గుపడాలి. తనకు సిగ్గు వేస్తుందని చంద్రబాబు అనడం కొత్తగా, వింతగా అనిపిస్తోంది. రీసెంట్‌గా చంద్రబాబు మరో మాట అన్నారు. భర్త ఆస్తిలో భార్యకు వాటా రాదా? అన్నది చంద్రబాబు ప్రశ్న. అలాగే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో ఏదో జరిగితే మా మీద పడి ఏడుస్తున్నారని, మాకేంటి సంబంధం అని చంద్రబాబు తెగ ఫీలైపోతున్నారు. అలా ఎందుకు అనాల్సి వస్తున్నదంటే చంద్రబాబు వారి కుటుంబవ్యవహారాన్ని కుటుంబవ్యవహారంగా వదిలేసి ఉంటే ఎవరూ పల్లెత్తు మాట అని ఉండేవారు కాదు! చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా వైఎస్‌ కుటుంబవ్యవహారాన్ని వాడుకోలేదా? జగన్‌ వ్యక్తిత్వ హనానానికి పాల్పడలేదా? టీడీపీ అధికార ఎక్స్‌ అకౌంట్‌ నుంచే షర్మిల(YS sharmila) లేఖ రావడాన్ని ఏమనుకోవాలి? ఇవి చేయకుండా ఉండి ఉంటే చంద్రబాబు సిగ్గుపడానికి ఓ అర్థం ఉండేది. ఇవన్నీ చేసి ఇప్పుడు సిగ్గేస్తుందనడం చూస్తే సిగ్గే సిగ్గుతో చచ్చిపోతుందేమో!


Updated On 25 Oct 2024 6:38 AM GMT
Eha Tv

Eha Tv

Next Story