రూటు మార్చిన చంద్రబాబు !
గతంలో ముఖ్యమంత్రిగా పని చేస్తున్న సమయంలో చంద్రబాబునాయుడు(Chandrababu) జిల్లాల పర్యటనకు వెళుతున్నప్పుడో, జిల్లా హెడ్‌క్వార్టర్ దాటి బయటకు వెళుతున్నారంటేనో , ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ ఉండేది. ముఖ్యంగా మహిళా సంఘాలను తరలించేవారు. స్కూల్ పిల్లలను తీసుకొచ్చేవారు. పార్టీ క్యాడర్ కూడా అక్కడికి వచ్చేది. ఓ బహిరంగసభ తప్పనిసరిగా ఉండేది. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇలాగే ఉండేది. ఆయన బటన్ నొక్కే కార్యక్రమాలలో చాలా పెద్ద ఎత్తున జనసమీకరణ జరిగేది. అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవారు. ఈ బహిరంగసభలు ప్రభుత్వ ఖర్చుతోనే జరిగేవి. చాలా సంవత్సరాలుగా ఇలాగే జరుగుతూ వచ్చింది. నిజానికి ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబునాయుడు. జన్మభూమి పేరుతో ఆయన సభలు నిర్వహించారు. ర్యాలీలు కూడా చేశారు. వీటిల్లో విద్యార్థులు, మహిళా సంఘాల పార్టిసిపేషన్ తప్పనిసరిగా ఉండేది. నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు తాను ఈ సారి తాను పూర్తి భిన్నంగా కనిపిస్తానని చెప్పారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని అంటూ నిజంగానే కొత్తగా కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా, గతంలో ఎప్పుడూ ఆయన పర్యటనలో చూడనట్టుగా ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఉదాహరణకు మడకశిరలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పర్యటన చూస్తే అక్కడ పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకు ముందు మంగళగిరిలో కూడా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు సందర్భాలలో కూడా ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా ప్రజల దగ్గరకు వెళుతున్నారు. పెద్ద హడావుడి లేకుండా, రోప్‌లు లేకుండా, పోలీసులు ప్రజలను నెట్టివేయకుండా చంద్రబాబు పర్యటనలు సాగుతున్నాయి.