TTD Chairman : చాగంటి, గరికపాటి టీటీడీకి అర్హులు కారా?
తిరుమల తిరుపతి దేవస్థానం గడచిన నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో చర్చల్లో ఉందో చూశాం!
తిరుమల తిరుపతి దేవస్థానం గడచిన నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో చర్చల్లో ఉందో చూశాం! చూస్తున్నాం! అంతకు ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేక అంశాలపైన వివాదాలు రావడం చూశాం! తిరుమల ఆలయాన్ని మొత్తం స్వర్ణమయం చేయాలి అన్న విషయంపై అప్పటి టీటీడీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు బంగారాన్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టినప్పడు చాలా మంది భక్తులు తమ తాహతుకు తగినట్టుగా బంగారాన్ని సమర్పించుకున్నారు. అప్పుడు ఆదికేశవులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ధనవంతుడైన ఆయనపైనే ఆరోపణలు రావడం విశేషం. ఆనంద నిలయం, ఆనంత స్వర్ణమయం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలతో మొదలు పెడితే ఆ తర్వాత టీటీడీపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా శ్రీవారి ప్రసాదం లడ్డూపై వచ్చిన వివాదం కోట్లాది మంది భక్తులను కదిలించింది. వారిలో ఆవేదనను రగిల్చింది. తర్వాత వచ్చిన వివాదాలన్నీ ఆర్ధికపరమైన అంశాలపైనే ఏర్పడ్డాయి. శ్రీవారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు పవిత్రంగా భావిస్తారు. అందులో కల్తీ జరిగిందనే వార్తలు పెను దుమారాన్ని రేపాయి. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందారు. తర్వాత నెయ్యిలో కల్తీ జరగలేదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఊరట చెందారు. ఈ వివాదంలో నిజాలను నిగ్గుతేల్చడానికి సీబీఐ నేతృత్వంలో ఓ సిట్ ఏర్పాటయ్యింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చేయడానికి, టీటీడీని గాడిలో పెట్టడానికి, టీటీడీని సరైన మార్గంలో నడిపించడానికి, గతంలో ఎవరూ చేయనంతగా అద్భుతాలు చేయడానికి కూటమ్ సర్కారుకు ఓ సువర్ణావకాశం లభించింది. ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం వినియోగించుకుంటే మాత్రం కచ్చితంగా టీటీడీ బాగుంటుంది. టీటీడీని బాగు చేశామనే పేరు కూడా కూటమి సర్కారుకు దక్కుతుంది. తాను శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడని, తిరుమల ఉన్న జిల్లాలో తాను పుట్టానని, అలిపిరిలో తన ప్రాణాలు కాపాడింది ఆ ఏడుకొండలవాడేనని చంద్రబాబు చెబుతుంటారు. డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు, పవన్‌లిద్దరికీ తిరుమల క్షేత్రంపై భక్తి భావన ఉందనేగా! టీటీడీ ప్రక్షాళన కావాలంటే, టీటీడీలోకి రాజకీయ వాసనలు చొరబడకుండా ఉండాలంటే పాలకమండలి ఛైర్మన్ పదవిని చాగంటి కోటేశ్వరరావుకో, గరికపాటి నరసింహరావుకో అప్పగించవచ్చు కదా! వీరికి ఆ పదవి ఇస్తే ఎవరూ అభ్యంతర పెట్టరు. పైగా మెచ్చుకుంటారు కూడా!