Vizag Drugs Case : విశాఖ డ్రగ్స్ కేసు మూసేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP politics) ప్రస్తుతం తిరుమల లడ్డూ చుట్టే తిరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP politics) ప్రస్తుతం తిరుమల లడ్డూ చుట్టే తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటింది. ఈ వంద రోజుల పాలనలో ఆరు గ్యారంటీలో పూర్తిగా అమలు చేయలేదని, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే టీడీపీ(TDP) ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూలో(Tirumala laddu) ఏదో జరిగిపోయిందంటూ అవాస్తవాలు చెబుతూ వస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఆరోపిస్తున్నది. మరోవైపు కూటమి నేతలు కూడా వైసీపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మీడియాలో ఉభయ వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గత మార్చిలో విశాఖపట్నం కేంద్రంగా ఒక కీలకమైన సంఘటన జరిగింది. 25 వేల కిలోల డగ్స్‌ను విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారు. విశాఖపట్నం పోర్టుకు 25 వేల కిలోల డ్రగ్స్ రావడమనేది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఈ డ్రగ్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఎవరు తీసుకొచ్చాన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. విశాఖపట్నానికి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్(Drugs) వస్తున్నాయన్న సమాచారం ఇంటర్‌పోల్ అందించడంతో సీబీఐ, కస్టమ్స్ అధికారులు నేరుగా పోర్టుకు వెళ్లి ఆ డ్రగ్స్‌ను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆక్వా పోర్టుకు సంబంధించిన ఒక కంపెనీ దిగుమతి చేసుకున్న లగేజ్‌లో ఈ మొత్తం డ్రగ్స్ ఉన్నాయంటూ, ఆ కంపెనీ ఎవరిది మీదా? మాదా? అంటూ అప్పుడు కూడా రాజకీయ పార్టీలు వాదించుకున్నది చూశాం. ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి దగ్గర బంధువులంటూ అప్పుడు వైసీపీ ఆరోపించింది. అలాగే తెలుగుదేశంపార్టీకి చెందిన దామచర్ల సత్య, ప్రస్తుత నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల ప్రమేయం కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు తెలుగుదేశంపార్టీ నాయకులు వైసీపీపై వేలెత్తి చూపారు. ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా జగన్ మార్చేశాడని అన్నారు. విజయసాయిరెడ్డి ఇందుకు కారకుడని చెప్పారు. ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇలా పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయో, వాటిపైన కూడా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇదేం చిన్న మొత్తం కాదు. మామూలుగా హైదరాబాద్‌లో వంద గ్రాముల డ్రగ్స్ దొరికితేనే రచ్చ రచ్చ అవుతుంది. పెద్ద ఇష్యూ అవుతుంది. పట్టుకున్న డ్రగ్స్ వాల్యూపై జనం మాట్లాడుకోవడం కూడా చూశాం. అలాంటిది విశాఖలో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికితే ఇప్పటి వరకు దోషులెవరన్నది తేలకపోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరు ఈ డ్రగ్స్‌ను రప్పించారు? ఆ కింగ్‌పిన్ ఎవరు? అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం దర్యాప్తు సంస్థలు ఎందుకు ప్రయత్నించడం లేదు?