Sailajanath : లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే
తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై కాంగ్రెస్(Congress) సీనియర్ నాయకుడు శైలజానాథ్(Sailajanath) విస్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు.
తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై కాంగ్రెస్(Congress) సీనియర్ నాయకుడు శైలజానాథ్(Sailajanath) విస్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) చెప్పినదాంట్లో ఆవగింజంతైనా నిజం లేదన్నారు. టీటీడీ(TTD) కమిటీ వేసే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది తప్ప తిరుమల వ్యవహారాలలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదన్నారు శైలజానాథ్. ఆ మాటకొస్తే దేవాదాయ శాఖ మంత్రికి కూడా పెద్దగా అజమాయిషీ చేయలేరన్నారు. ఈవో, జేఈవోలకే అధికారాలు ఉంటాయని చెప్పారు. 'టీటీడీ పాలకమండలిలో ఉన్నవారు హిందువులు. అక్కడ పని చేసేవారు హిందువులు. లడ్డూలు తయారుచేసేవారు హిందువులు. సర్టిఫైడ్ నెయ్యి అక్కడికి వచ్చినప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినవాడు తప్పు చేశాడా? తిరుమలలో నెయ్యి ఒక్కటే కాదు, ప్రతి అంశాన్ని తనిఖీ చేస్తారు. నాణ్యతాలోపం ఉంటే వెనక్కి పంపిస్తారు. ఎవరైనా తక్కువ నాణ్యత ఉన్న నెయ్యిని సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు పార్టీ సమావేశాలో లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని అందుకుని మిగతా వారు ఆవేశపడిపోయారు. అసలు కల్తీ నెయ్యి వాడనే వాడలేదని స్పష్టంగా తెలుస్తోంది. ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌లో కూడా నెయ్యిలో ఫలానా ఫలానా కలిశాయంటూ చెప్పలేదు. కలిసి ఉండొచ్చు అని అనుమానపడింది. వ్యవస్థలో లోపాలుంటే దాన్ని సవరించుకోవాలి. అంతే తప్ప జరగని దానిని జరిగినట్టుగా ప్రచారం చేయడం ఏమిటి? కడప, చిత్తూరు ప్రజలు వణికిపోయారు చంద్రబాబు మాట విని. రాజకీయాలకోసం తిరుపతి వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం చంద్రబాబుకు తగనిపని! ఇక డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అయితే అనారోగ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మాటల్లో బెదిరింపు కనిపించింది. పవన్ మాటలు వింటున్నప్పుడు మొదట ఆశ్చర్యం వేసింది. తర్వాత కాస్త నవ్వు వచ్చింది. అటు పిమ్మట కోపం వచ్చింది. మాట్లాడితే అనుకూలంగా మాట్లాడండి.. లేకపోతే గమ్మున ఉండండి అంటూ పవన్ బెదిరిస్తున్నారు. మణిపూర్‌లో అంత హింస జరుగుతుంటే, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే, అమాయకుల ప్రాణాలు పోతుంటే ఒక్కరైనా మాట్లాడారా? బహుశా బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్ అలా మాట్లాడి ఉంటారేమో! జనసేన(Janasena) పార్టీని కంప్లీట్‌గా బీజేపీలా మార్చేశారు పవన్. తప్పు జరిగి ఉంటే దాన్ని రుజువు చేసే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. దేవుడితో రాజకీయాలు చేయడం సరికాదు. వేంకటేశ్వరస్వామిని జగన్మోహన్‌రెడ్డిని 14 సార్లు దర్శించుకున్నారు. అప్పుడు లేని డిక్లరేషన్‌ను ఇప్పుడు అడగడమేమిటి? ' అని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.