ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల కథ ముగిసింది. వాలంటీర్లు ఇక కనబడరు. వాలంటీర్ల పేరు వినబడదు.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల కథ ముగిసింది. వాలంటీర్లు ఇక కనబడరు. వాలంటీర్ల పేరు వినబడదు. వాలంటీర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ లేదని, లేకుండా పోవడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని కూటమి సర్కార్‌ తెలిపింది. వాలంటీర్ల వ్యవస్థపై శాసనమండలిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. దీనికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాలవీరాంజనేయులు షాకింగ్‌ సమాధానం చెప్పారు. 'నిజమే ..మేము వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అందుకు సంబంధించిన జీవో గత ప్రభుత్వం ఇవ్వలేదు. లేని వ్యవస్థను మేము ఎలా కొనసాగిస్తాము? లేని పిల్లోడికి ఎలా పేరు పెడతారు? వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తేకదా, వాళ్లకు జీతాలు పెంచడానికి' అని తడుముకోకుండా సమాధానం చెప్పారు. ఇది వాలంటీర్లను నిలువునా దగా చేయడమే అవుతుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దానిని కొనసాగించకపోతే దగా ఎలా అవుతుందనే సందేహం ఈ వ్యవహారం తెలియనివారికి రావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఉగాది పండు రోజున తెలుగుదేశంపార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు వాలంటర్లీకు ఓ తీపి కబరు చెప్పారు. 'రాష్ట్రంలోని వాలంటీర్లందరికీ ఒక కానుకను ఇస్తున్నాను. వాలంటీర్ల వ్యవస్థను మేము రద్దు చేస్తామనే ఒక దుష్ర్పచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మకండి. మేము వాలంటీర్ల వ్యవస్థను తీసేయడం కాదు. వాలంటీర్ల జీతాన్ని అయిదు వేల రూపాయలు కాదు. రెట్టింపు చేసి 10 వేల రూపాయలు ఇస్తాము.' అని ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హమీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, మీరు జీతాలు పెంచుతామని చెప్పాల్సిన అవసర ఏమొచ్చింది? మీరు కంటిన్యూ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆల్‌రెడీ రద్దు అయిన వ్యవస్థను తాము కంటిన్యూ చేస్తామని చెప్పారంటే వాలంటీర్లు చేస్తారనే అనుకుంటున్నారు కదా! ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ కాబట్టి వారు గట్టిగా నమ్మారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీని నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నెపం వేస్తే ఎలా? ఇది ప్రజలను మోసం చేసినట్టు కాదు! వాలంటీర్లు ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి దగ్గరకు చేర్చారు. ప్రతి నెలా ఇంటిదగ్గరకే వచ్చి పెన్షన్లను అందచేశారు. అలాంటి వాలంటీర్ల సర్వీసును రద్దు చేయడమంటే, వారి ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరినీ మోసం చేసినట్టే! తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టయితే వాలంటీర్ల లేకపోతే ఇబ్బంది పడతామేమోనన్న భయంతో ప్రజలు మీకు ఓట్లు వేసేవారు కాదేమో! ఇప్పుడు ప్రజలను మోసం చేశామనే పశ్చాత్తాపం ఏమీ లేకుండా నెపాన్ని గత ప్రభుత్వంవైపు నెట్టేయాలనే ఆలోచనను సర్కార్‌ చేస్తోంది. దీనిని సిగ్గుమాలిన చర్యగానే చూడాలి.


ehatv

ehatv

Next Story