YS Jagan Poru Bata:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోరుబాట!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతోంది. ఆ పార్టీ దూకుడు చూస్తుంటే కాస్త తొందరపడుతుందా అని అనిపిస్తోంది.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతోంది. ఆ పార్టీ దూకుడు చూస్తుంటే కాస్త తొందరపడుతుందా అని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్(AP)లో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచాయి. ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీని కట్టబెట్టి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు ఆశించారు. కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేరతాయని భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చెబుతున్నమాటేమిటంటే ఎన్నికల హామీలను అమలు చేయాలని ఉన్నా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని అంటోంది. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని చెబుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) చేసిన విధ్వంసం నుంచి తేరుకోవడానికి చాలా కాలం పడుతుందని ప్రజలకు విన్నవించుకుంటోంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కూడా కూటమి సర్కారు చాలా కాలం తీసుకుంది. మొత్తం మీద హామీల అమలుపై కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నదన్నది వాస్తవం! అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు వైఫల్యం చెందదని ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ భావిస్తోంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి ఆరు నెలలో, ఏడాదిపాటో సమయం ఇవ్వడం సర్వ సాధారణం. ఆ లోగా ప్రభుత్వం ఏమీ చేయకుండా ఉంటే అప్పుడు విమర్శలకు దిగుతాయి విపక్షాలు. ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి ప్రభుత్వానికి కొంచెం సమయం ఇద్దామని అనుకుంది. కానీ కూటమి సర్కారు అన్ని రంగాలలో విఫలం చెందుతున్నదని, ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. అందుకే తాము పోరుబాట పట్టాల్సి వస్తున్నదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యకర్తలకు ఓ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు.కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మొదటి నిరసన కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయం దేశ ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఢిల్లీ(Delhi)లో ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కార్యక్రమానికి జాతీయ పార్టీలకు చెందన నాయకులు కూడా హాజరయ్యారు. నేషనల్ మీడియా కూడా బాగానే కవర్ చేసింది. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ప్రజలకు సంబంధించిన సమస్యలపై పోరాటం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ డిసైడయ్యింది. ఇందులో భాగంగానే రైతులకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు నాయకులు.
