కడప(Kadapa) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక(By elections) రాబోతున్నదా?
కడప(Kadapa) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక(By elections) రాబోతున్నదా? అక్కడ మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉందా? అంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి అవకాశం లేదనే చెబుతారు. ఎందుకంటే కడప లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్ అవినాష్‌రెడ్డి(YS Avinash) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అక్కడ ఉప ఎన్నిక ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) పార్లమెంట్‌కు వెళ్లబోతున్నారని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చూపుతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. జగన్ అసెంబ్లీకి వెళ్లరని అనుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లడానికి జగన్ నిరాసక్తత కనబరుస్తున్నారట! స్పీకర్ ఎన్నిక సందర్భంగా, స్పీకర్‌కు లేఖ రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూసిన వారికి ఎవరికైనా ఆయన అసెంబ్లీకి వెళతారని అనిపించడం లేదు. ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు కానీ, అసెంబ్లీలో తమ పట్ల స్పీకర్ వ్యవహరించిన తీరుపై జగన్ వ్యక్తపరచిన భావన చూసినప్పుడు కానీ అసెంబ్లీకి వెళ్లే యోచనలో జగన్మోహన్‌రెడ్డి లేరనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు శాసనమండలి సభ్యుల సమావేశంలో కూడా జగన్ కొన్ని వ్యాఖ్యాలు చేశారు. మనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దొరకదని, మండలిలోనే పోరాటం చేయాల్సి ఉంటుందని జగన్ అన్నారు. ఇవన్ని చూస్తే జగన్‌కు అసెంబ్లీలో అడుగుపెట్టాలని లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన భవిష్యత్తు కార్యక్రమమేమిటి? అయిదేళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది. అయిదేళ్లపాటు కూటమి అధికారంలో ఉంటుంది. ఈ అయిదేళ్లపాటు అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం ప్రజల దగ్గరకు వెళ్లాలన్నా కొంచెం సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ పార్లమెంట్‌కు వెళితే బాగుంటుందని, పార్టీ అధినేతగా ఢిల్లీలో ఉండటమే మంచిదని సన్నిహితులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది. అందుకే జగన్ పులివెందుల(Pulivendhula) అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తారని చెబుతున్నారు. జగన్ కడప లోక్‌సభ నుంచి పోటీ చేయడానికి అవినాష్‌రెడ్డి మార్గం సుగమం చేయనున్నారు. కడప లోక్‌సభ సీటుకు అవినాష్‌రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి జగన్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారు. అక్కడ విజయం సాధించి పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆలోచన జగన్ చేస్తున్నారట! పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ రాజీనామా చేస్తే అది ఖాళీ అవుతుంది. అప్పుడు వై.ఎస్.విజయమ్మను పులివెందుల బరిలో దింపాలన్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని ఈ కింద వీడియోలో చూద్దాం.