Osmania Univeristy : ఓయూ లాఠీఛార్జ్ ప్రాక్టీస్ కు వేదికా?
ఓయూ లాఠీఛార్జ్ ప్రాక్టీస్ కు వేదికా?
తెలంగాణలో పరీక్షలు(Telangana Exams) వాయిదా కోరుతూ నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ప్రధానంగా డీఎస్సీని(DSC) వాయిదా వేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. అలాగే డీఎస్సీలో పోస్టులు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనకు(Unemployed Protest) అయినా, ఉద్యోగుల ఆందోళనకు అయినా , ఉద్యమాలకైనా కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University). ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపైన పోలీసులు దురుసగా ప్రవర్తించారు. లాఠీచార్జ్ కూడా చేశారు. పదేళ్లకు ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి వాతావరణమే ఉండేది. ఎప్పుడూ రణరంగం దృశ్యాలే కనిపిస్తూ ఉండేవి. విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలు చేసేవారు. ఆ సమయంలో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగింది. పాపం విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదారు. హాస్టళ్లలోకి వెళ్లి మరీ పోలీసులు దాష్టికం చేశారు. అదే సమయంలో అక్కడ జర్నలిస్టులపై లాఠీచార్జీ కూడా జరిగింది. ఫైరింగ్ కూడా జరిగిన సందర్భాలను కూడా మనం చూశాం. రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం, పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడటం చరిత్ర సత్యాలు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉస్మానియా కాస్త నెమ్మదించింది. అయితే పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కూడా అప్పుడప్పుడు విద్యార్థులు ఉస్మానియా వేదికగా ఆందోళన చేశారు. ప్రభుత్వం తీరుపై ప్రశ్నించారు. నోటిఫికేషన్లపై నిలదీశారు. ఇప్పుడు నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం లేదు. నిరుద్యోగుల డిమాండ్ల ఏమిటో తెలుసుకోవడానికి ఓ ప్రతినిధి బృందాన్ని పంపితే సరిపోతుంది. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ఆ పని ఎందుకు చేయదు? బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమీ చేయడం లేదనే కదా వారు కాంగ్రెస్‌ను ఎన్నుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా చేయడం మంచిది కాదు కదా!