ముక్కోటి ఏకాదశి... సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి. అందుకే వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి.. మూడు […]

ముక్కోటి ఏకాదశి...  సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.   ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి. అందుకే వైష్ణవ ఆలయాలలో గల   ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.     ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమని స్కాంద పురాణం చెబుతోంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. అందుకే, ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్నదానం చేస్తే మంచిదంటారు. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.         ఏంటీ ఏకాదశ నియమాలు?   ఉన్నాయి! ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.      ప్రాశస్త్యమైన పురాణ కథ ఉందా?    ఉంది. దానికి ఆధారాలూ ఉన్నాయి. ముక్కోటి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.     పర్వతమహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అందుకే నరక బాధలను అనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!   ఇక   మురాసురుడి కథ రెండోది.   కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు ఈ మురాసురుడు. అప్పుడు దేవతలందరు కలసి తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.   విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడట! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందిందన్నది మరో కథ.    తాత్త్విక సందేశం ఏం చెబుతుంది?    మురాసురుడు విష్ణువును వెతుక్కుంటే వచ్చిన ఆ గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.   ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానంలాంటి సాధనాల ద్వారా ఆరాధించాలని భావం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.   అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు.     ఉత్తర ద్వారమే ఎందుకు?  ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.     ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుంది.     ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.   ఇందుకోసం ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.     ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు.   ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.     హరినామ స్మరణం...    సమస్త పాప హరణం.
Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story