Earth Not Rotate : భూమి తిరగడం ఆగిపోతే జరిగే విపత్తులేంటి.?
మన పుట్టుక, మన మరణం ఈ భూమికే అంకితం. ఈ భూమిలేకపోతే సమస్త మానవాళి మనుగడే లేదు. ఈ విశ్వంలో జీవం మనుగడ సాధించేది ఒక్క భూమి మీదనే. 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన ఈ భూమి గురించి ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. మన టెక్నాలజీకి అందని విశ్వరహస్యం ఇంకా ఏదో చాలానే ఉంది. ఇక మనం చిన్నప్పటి నుండి చదువుకున్నది ఒకసారి గమనిస్తే.. మనందరి ఆధారం భూమి ఒక్కటే. […]
మన పుట్టుక, మన మరణం ఈ భూమికే అంకితం. ఈ భూమిలేకపోతే సమస్త మానవాళి మనుగడే లేదు. ఈ విశ్వంలో జీవం మనుగడ సాధించేది ఒక్క భూమి మీదనే. 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన ఈ భూమి గురించి ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. మన టెక్నాలజీకి అందని విశ్వరహస్యం ఇంకా ఏదో చాలానే ఉంది. ఇక మనం చిన్నప్పటి నుండి చదువుకున్నది ఒకసారి గమనిస్తే.. మనందరి ఆధారం భూమి ఒక్కటే. భూమి తన చుట్టూ తాను తిరిగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365.26 రోజులు పడుతుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. ఇది అందరికి తెలిసిన మేటరే. అదే భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక ఐదు సెకన్లు ఆగిపోతే ఏం జరుగుతుంది..? సమస్త మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం అవుతుందా..? అసలు భూమి ఎలా తిరుగుతుంది..? దాన్ని ఏ శక్తి తిప్పుతుంది. ఇలా ఆలోచించుకుంటూ పోతే మన మెదడును తొలిచే సందేహాలు ఎన్నో. ఇలాంటి సందేహాలు కొన్ని అయిన తీర్చే ప్రయత్నం చేసే ఉద్దేశమే ఈ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం.. భూమి తిరగడం ఒక ఐదు సెకన్లు ఆగిపోతే ఏం జరుగుతుందో చూద్దాం.
మొదట భూమి..దాని పుట్టుక ఎలా ఉంది.. అనే అంశం లోతుల్లోకి వెళ్తే విశ్వంలోని భూమి సూర్యుని చుట్టూ ఉండే దుమ్ము, ఇతర వాయువుల సమూహం నుంచి ఆవిర్భవించింది. మొదట మొత్తం ఒకే ఖండంగా ఉన్న భూమి... తర్వాత వాతావరణంలో వచ్చిన పెను మార్పుల కారణంగా ఖండాలు, సముద్రాలుగా ఏర్పడ్డాయి. అయితే భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం. ఈ విశ్వం లో ఉన్న అన్నీ గ్రహాల్లో కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉంది. ఎందుకంటే భూమి పై మాత్రమే నివసించేందుకు కావాల్సిన నీరు, ఆక్సిజన్, సూర్యరశ్మి ఉంది. వీటివల్లే భూమి పై జీవం ఆవిర్భవించిందని అంచనా. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్లే అంతరిక్షం పైకి తేలకుండా భూమి పై జీవ జాతి నిలబడ గలుగుతోంది. భూమి మధ్యలో భ్రమనాక్షం ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు ఉంటుంది. దాని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, భూమి దాని అక్షం పై 23.4 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ కారణంగానే కాలాలు ఏర్పడుతున్నాయి.
భూమి 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అలా భూమి ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా? గంటకు దాదాపు 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి 23 గంటల 56 నిమిషాల 4 సెకన్లలో సుమారు 40,075 కిలోమీటర్లు తిరిగేస్తుంది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నా..ఇదే నిజం. భూమి తిరుగుతున్నప్పుడు మనం కూడా తూర్పు దిశగా గంటకు 800 మైళ్లు సుమారు 1,287 కిలోమీటర్ల వేగంతో భూమితో పాటు కదులుతున్నాం మరి భూమి తో పాటు అంత వేగంగా తిరుగుతున్నా మనకు ఆ ఫీల్ ఎందుకు రావడం లేదనే సందేహం కూడా చాలామందిలో వచ్చే ఉంటుంది. దీనికి కూడా సమాధానం ఉంది. భూమి తిరిగే వేగం, కక్ష్య వేగం రెండూ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనకు తిరుగున్న అనుభూతి కలగదు.
మరి, భూమి తిరగడం నిలిచిపోతే ఏమవుతుంది? సడెన్‌గా ఈ భ్రమణం ఆగిపోతే ఏమవుతుంది..? అదే జరిగితే 800 మైళ్ల వేగంతో పడిపోతాం. ఈ చర్య భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరినీ చంపుతుంది. వేగంగా వెళ్తున్న బస్సుకు ఒక్కసారే బ్రేక్ వేస్తే ఏ విధంగా ప్రయాణికులంతా ముందుకొచ్చి పడతారో.. తిరిగే భూమి ఆగిపోతే.. అదే వేగంతో మనమూ ఎగిరిపడతాం. మనం మాత్రమే కాదు... భూమిపై ఉన్న సకల జీవులు, వస్తువులు, వాహనాలు అన్నీ చీలిపోయినట్లుగా సర్రున చుట్టుపక్కలకు దూసుకుపోతాయి. ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకుంటాయి. ఎంత వేగంతో ఢీకొట్టుకుంటాయంటే గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో... ఒక్కసారి ఊహించుకోండి... గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు మరో వాహనాన్ని ఢీకొంటే ఎంత బీభత్సం అవుతుంది. మరి అలాంటిది భూమి పై ఉన్న సమస్త ప్రాణ కోటి ఒకడనికోటి ఢీ కొట్టుకుంటాయి. ఇంకేముంది సర్వనాశనమే. పర్వతాలపై మంచు, సముద్ర నీరు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్లి... తిరిగి భూమిపై పడతాయి. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. విపరీతమైన పేలుళ్లు జరుగుతాయి. ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, ఆయుధ కర్మాగారాలు అన్నీ పేలిపోతాయి. ఊహించలేని పెను విపత్తు కళ్ళ ముందుంటుంది. ఇక భూమిపై జీవరాశి అన్నదే మిగలదు. రాత్రి, పగలు అనే తేడా ఎప్పటికీ ఉండదు. కొన్ని దేశాలు ఎప్పటికీ సూర్యుడినే చూడాల్సి వస్తుంది. అదే సమయంలో మరి కొన్ని దేశాలు కేవలం చీకట్లోనే ఉండిపోతాయి. ఎందుకంటే రాత్రి, పగలు అనేవి ఏర్పడటానికి భూమి తిరగడంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి. ప్రస్తుతం ఉండే కాలాల ప్రక్రియ కూడా ఉండదు. శీతాకాలం, వేసవి కాలం, వర్షకాలం అనేవి అస్సలు ఉండవు. ఇవి విశ్వం పై అనేక దుష్ప్రభావాలను చూపుతుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాలన్నీ అతి భయంకరమైన వేడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలన్నీ అత్యంత భయంకరమైన చలికి గజగజ వణికిపోతాయి.
ఎప్పుడైతే భూమి ఆగిపోతుందో... ఇక అప్పుడు ఓషన్ కరెంట్స్ ఆగిపోతాయి. సముద్రాలపై గాలి భూమిని చేరదు. భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోతుంది. చెట్లు, చేమలూ అన్నీ కాలిపోతాయి. కార్చిచ్చులతో భూమి అగ్నిగోళంలా మారుతుంది. సముద్రాల్లో ఉన్న నీరు వేడికి ఆవిరైపోతుంది. అలా భూమి చివరకు అంగారక గ్రహంలా మారిపోతుందనేది శాస్త్రవేత్తల అంచనా. భూమి ఆగిపోతే చందమామకూ సమస్యే. చందమామ తన శక్తితో భూమికి చెందిన చాలా వాటిని లాక్కుంటుంది. అవి చందమామపై పడి పేలిపోతాయి. అక్కడ కూడా పెను వినాశనం జరిగే అవకాశం ఉంది. భూమి ఆగిపోతే... ఈ విపత్తులన్నీ కొన్ని రోజుల్లోనే జరగలవని అంచనా.
ఐతే నిజానికి భూమిని ఆపే శక్తి దేనికీ లేదు. వాతావరణంలోని ఏదీ భూమిని తిరగకుండా ఆపలేదు. చెప్పాలంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినప్పటి నుంచే తిరుగుతోంది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగిరా తిరిగేలా చేస్తున్నాయి. మనం ఓ బొంగరాన్ని తిప్పినప్పుడు... కొంత డ్రైవింగ్ ఫోర్స్ దానికి ఇస్తాం. ఆ ఫోర్స్ ఉన్నంతవరకూ అది తిరుగుతుంది. ఫోర్స్ తగ్గిపోతున్నప్పుడు దాని వేగం తగ్గిపోతుంది. చివరకు ఫోర్స్ పూర్తిగా అయిపోగానే... అది తిరగడం ఆగిపోతుంది. భూమి విషయంలో అలా లేదు. కంటిన్యూగా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటోంది. అందువల్ల భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. అది తిరిగే వేగంలో కూడా మార్పులు పెద్దగా రావు.
ఐతే సైన్స్ దేనికీ చిక్కదు కాబట్టి భూమి తిరగడం మెల్లి మెల్లిగా ఆగిపోతుంది అనుకుంటే అప్పుడు రాబోయే ఉపద్రవం కూడా నెమ్మదిగానే జరుగుతుంది. కానీ అది ముందే మనకు తెలియక పోయినా జరిగే ఉపద్రవం మాత్రం మనం కనిపెట్టగలం.. అదెలాగో చూద్దాం.
మొదటి రోజు..
భూభ్రమణంలో కలిగిన మార్పును మనిషి గుర్తించలేడు. కాని సూర్యోదయ సమయంలో మాత్రం ఆ తేడా కచ్చితంగా కనిపిస్తుంది. భూమి మాత్రమే స్లోగా తిరుగుతుంది. పైన కక్షలో ఉండే ఉపగ్రహాలు మాత్రం రోటీన్ స్పీడ్తోనే రౌండ్స్ వేస్తుంటాయి. ఈ మార్పును గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గుర్తించదు. దీంతో విమానాలు దారి తప్పుతాయి. ప్రపంచ వ్యాప్తంగా విమానాలన్నీ రన్ వేలకు దూరంగా దిగుతాయి. ప్రాణం నష్టం ఉండకపోవచ్చు. కాని ఫ్యూచర్ ఇంతకంటే భయంకరంగా ఉంటుందన్నది మాత్రం తెలుస్తుంది.
వారం తర్వాత..
భూమి తిరిగే స్పీడ్ స్లో అవడం గంటకు 15 కి.మీ.కి పెరుగుతుంది. విమాన ప్రమాదాలు కామన్ అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్‌లన్నీ మూతబడతాయి. మెల్లిగా మనకు కష్టాలు మొదలవుతాయి. భూమి తిరుగుతుంటే సముద్రాల్లోని నీళ్లు స్థిరంగా ఉండేవి. భూభ్రమణం ఆ నీటిని పట్టి ఉంచేది. కాని భూమి తిరిగే స్పీడ్ స్లో కావడంతో ఆ శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా సముద్రపు నీళ్లను ధృవాలు ఆకర్షిస్తాయి. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు జలప్రళయంలో చిక్కుకుంటాయి. నీళ్లే కాదు గాలి కూడా మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఒక్కసారిగా సముద్రాలు దిశ మార్పుకోవడంతో గాలి కూడా అవి వెళుతున్న వైపే పోతుంది. ఫలితంగా భూమిపై కొన్ని ప్రాంతాల్లో గాలి ఉండదు.
ఐదు నెలల తర్వాత..
భూభ్రమణ వేగం స్లో అవడం గంటకు 225 కి.మీకు పెరుగుతుంది. రోజుకు ఇరవై నాలుగు గంటలన్న ఈక్వేషన్ మారుతుంది. ఈ ఐదు నెలల కాలంలో యుగాల విలయం సంభవిస్తుంది. రిక్టర్ స్కేలు బద్దలయ్యే భూకంపాలు రోజూ వస్తాయి. అటు సముద్రంలోపలా అలజడి చెలరేగుతుంది. చేపలతో పాటు సముద్రజీవాలు చచ్చి తీరానికి కొట్టుకొస్తాయి. భూమధ్య రేఖ నుంచి ధ్రువాలవైపు సముద్ర నీరు కదలడంతో ఆర్కిటిక్ సముద్రపు లోతు 13 వేలకు చేరుతుంది. భూభ్రమణం స్లో కావడంతో భూమధ్యరేఖకు పైన లేదా కింద మాత్రమే గాలి ఉంటుంది. భూమికి మధ్యలో ఉన్న దేశాల్లో గాలి ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో ప్రాణ వాయువు లేక జీవ కోటి విలవిలలాడుతుంది.
సంవత్సరం తర్వాత..
గంటకు 340 కి.మీ స్పీడ్‌తో భూమి తిరుగుతుంది. భూనైసర్గిక స్వరూపం ఇంకా మార్పులకు లోనవుతూనే ఉంటుంది. లండన్ నుంచి ప్యారిస్‌కు నడుచుకుంటూ పోయే పరిస్థితి మాత్రం ఉండదు. సముద్రపు నీళ్లన్నీ ధ్రువాల వైపు కదలడంతో నార్త్ అట్లాంటిక్ సముద్రం ఫుల్ అవుతుంది. కొత్తగా వచ్చే నీటిని తన గర్భంలో దాచుకోలేదు. దీంతో యూరప్ ఖండం స్థానంలో కొత్త సముద్రం ఏర్పడుతుంది. లండన్, బెర్లిన్, మాస్కో సముద్రగర్భంలో కలుస్తాయి. కోట్లాది మంది కన్నుమూస్తారు.
రెండు సంవత్సరాల తర్వాత..
పగలు రెండున్నర రోజులతో సమానం..అలాగే రాత్రి కూడా..పడుకోవాలంటే 60 గంటలు వెయిట్ చేయాలి.. సూర్యోదయాన్ని చూడాలంటే మరో 60 గంటలు ఎదురుచూడాలి. ఈ అనూహ్య మార్పు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. వరదలు, సోలార్ రేడియేషన్, గాలి లేకున్నా ఏదోలా బతికిన మనుషుల్ని నిద్రలేమి కాటేస్తుంది. రక్తప్రసరణలో తేడా వచ్చి నరాలు కంట్రోల్ తప్పుతాయి. ఈ మార్పులను మెదడు అస్సలు తట్టుకోలేదు. ఎక్కడికక్కడ మనుషులు పిట్టల్లా రాలిపోతారు. ఒక్క మనుషులే కాదు..మిగతా ప్రాణకోటి కూడా బలవుతుంది. సుదీర్ఘ రాత్రులతో ఏర్పడ్డ చలితో మరికొన్ని జీవాలు చనిపోతాయి.
నాలుగు సంవత్సరాల తర్వాత..
గంటకు 60 కి.మీ స్పీడ్ తో భూమి తిరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ 55 డిగ్రీలకు పడిపోతుంది. ఈ దుర్భర పరిస్థితుల్లో జీవాలతో పాటు మొక్కలు కూడా బతకలేవు. సముద్రాలు ధ్రువాల వైపు కదలడంతో ఖాళీ అయిన ప్రదేశం ఒక కొత్త ఖండంగా తయారవుతుంది. ఈ మెగా కాంటినెంట్‌లోని మెజార్టీ ఏరియాల్లో గాలి పుష్కలంగా ఉంటుంది. మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుంది. కాని ఉన్నట్టుండి భయంకరంగా మారుతుంది. భూమి నార్మల్‌గా తిరుగుతున్నప్పుడు తూర్పు దిశలో పయనించే గాలి ఉత్తరం వైపు ఉండేది. పశ్చిమ దిశలో వీచే గాలి దక్షిణ ప్రాంతంపై ఆవరించి ఉండేది. కాని భూభ్రమణంలో వచ్చిన తేడాతో గాలి గతి తప్పుతుంది. తుఫానులు కామన్ అవుతాయి. ఉత్తర అమెరికాతో పాటు చాలా ప్రాంతాలు పూర్తిగా మంచులో కూరుకుపోతాయి.
ఐదు సంవత్సరాల తర్వాత..
రెండు కొత్త మహా సముద్రాలు ఏర్పడుతాయి. అమెరికాలోని కేన్ సన్ సముద్రతీర ప్రాంతంగా మారుతుంది. ఉత్తర అమెరికాలోని 8 లక్షల కిలోమీటర్ల భూభాగం మనుషుల నివసించడానికి అస్సలు పనికిరాదు. మిగిలిన ప్రాంతాల్లో బతికి ఉన్న ప్రజలకు ఈ ప్రాంతమే దిక్కవుతుంది.
ఫైనల్ గా..భూమి తిరగడం కంప్లీట్ గా ఆగిపోతుంది. కాని సూర్యుని చుట్టూ మాత్రం పరిభ్రమిస్తుంది. అప్పటి నుంచి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు ఉంటుంది. రెండు కొత్త సముద్రాలతో భూమి రూపు రేఖలు పూర్తిగా మారుతాయి. ప్రపంచం మధ్యలో కొత్త ఖండం ఏర్పడుతుంది. భూమధ్య రేఖ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఉండదు. పగలు ఆరునెలలు కావడంతో టెంపరేచర్ బీభత్సంగా పెరుగుతుంది. 60 డిగ్రీలకు చేరుతుంది. సముద్ర ఉపరితలంపై పీడనాలు ఏర్పడి భీకర తుఫాన్లు వస్తాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తాయి. కొత్త ఖండంపై ఎవరైనా బతికి ఉంటే వాళ్లకు ఆ వర్షపు నీళ్లే దిక్కు.. రాత్రి రాక్షసంగా ఉంటుంది. మైనస్ యాభైఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. కొత్త ఖండం లో కాకుండా ఇంకా ఎక్కడైనా ఎవరైనా బతికి ఉంటే వాళ్లంతా చచ్చిపోతారు.
గుడ్ న్యూస్ ఏమిటంటే..భూమి తిరగడం నిలిచిపోవాలంటే బోలెడంత శక్తి అవసరం అవుతుంది. భూమిపై తిరిగే అన్ని వస్తువులకు సమానమైన చలనానికి సమానమైన శక్తి తీసుకుంటుంది. కానీ, భూమిపై ఉన్న ఎలాంటి మెకానిజమ్ ఆ శక్తిని ఇవ్వలేవు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు.