హోలీ అంటే ఒకరికొకరు రంగులు పూసుకోవడం, రంగుల్లో ముంచి తేలడం, విందు వినోదాలతో మజా చేయడమే అందరికీ తెలుసు. ఈ పండుగ రోజు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసి కొట్టుకోవడం మాత్రం విని ఉండం.. ఇది చిత్రవిచిత్రమే మరి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ రోజు గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోయి గుద్దుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. రక్తాలు కారినా, సొమ్మసిల్లి పడిపోయినా ఎవరూ పట్టించుకోరు. ఏదో ఒక వర్గం […]

హోలీ అంటే ఒకరికొకరు రంగులు పూసుకోవడం, రంగుల్లో ముంచి తేలడం, విందు వినోదాలతో మజా చేయడమే అందరికీ తెలుసు. ఈ పండుగ రోజు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసి కొట్టుకోవడం మాత్రం విని ఉండం.. ఇది చిత్రవిచిత్రమే మరి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ రోజు గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోయి గుద్దుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. రక్తాలు కారినా, సొమ్మసిల్లి పడిపోయినా ఎవరూ పట్టించుకోరు. ఏదో ఒక వర్గం గెలిచే వరకు ఈ పిడిగుద్దులాట సాగాల్సిందే. దాదాపు వందేళ్ల కిందటి నుంచి కొనసాగుతోంది ఈ గమ్మత్తయిన పండుగ..

ఉదయం నుంచే గ్రామంలో సందడి మొదలవుతోంది. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో గడుపుతారు. మందు విందులతో మజా చేసుకుంటారు. సాయంత్రం కాగానే గ్రామ పొలిమేరల్లో కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గ్రామం మధ్యలో గల హన్మాన్ మందిరం ముందు పిడుగుద్దులాటకు వేదికను సిద్ధం చేస్తారు. ఆటకు ముందు డప్పు వాయిద్యాలతో గ్రామ పెద్దల ఇళ్ళకు వెళ్ళి ఆట స్థలం వరకు ఎదుర్కొని వస్తారు. వారు వచ్చాక ఆట మొదలవుతోంది. గ్రామస్తులు రెండు వర్గాలుగా ఏర్పడి పొడవాటి తాడుకు ఇరువైపులా నిలబడతారు. గ్రామ పెద్ద పూజ నిర్వహించి ఆటను ప్రారంభిస్తారు. సుమారు అరగంట పాటు పిడికిళ్లతో ఒకరినొకరు గుద్దుకుంటారు. దెబ్బలు తగిలి రక్తం కారినా లెక్కచేయరు. రక్తం కారిన చోట గాయానికి సున్నం పెట్టుకొని మళ్లీ ఆటలో పాల్గొంటారు తప్ప వెనుకడుగు వేయరు. వయోభేదం లేకుండా, కుల మతాలకతీతంగా అన్ని వర్గాల వారూ ఈ ఆటలో పాల్గొనడం విశేషం. చివరలో పిడిగుద్దుల వర్షం కురిపించుకున్న వారంతా ఆలింగనం చేసుకొని ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనవాయితీగా వస్తున్న ఈ ఉత్సవాన్ని నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం కలుగుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు.
ఎలా మొదలైందో తెలియదు. ఎవరు శ్రీకారం చుట్టారో వివారాల్లేవు.. దీనికి ప్రతినిధి ఎవరు? నిర్వాహకులెవరు? ఎవరికీ అంతుచిక్కదు... కానీ, హోలీ పండుగ రోజు మాత్రం గ్రామస్తులంతా పోగై కుమ్ములాడుకుంటారు. ఇది బాహాటంగా, అట్టహాసంగా సాగడం ఓ విశేషమైతే.. స్థానిక పోలీసులు, అధికారులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కావడం మరో విశేషం.

Updated On 7 March 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story