Rafael dos Santos Tosta Divorce Celebration : భార్యకు విడాకులిచ్చాడు. జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. ఆసుపత్రి పాలయ్యాడు.
బ్రెజిల్‌లో(Brazil) రఫేల్ డోస్ సాంటోస్ టోస్టా(Fail dos Santos toe) అనే కుర్రాడున్నాడు. అతడు పెళ్లి గురించి బోల్డన్ని కలలు కన్నాడు. సంసార జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశతోనే చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నాడు.
బ్రెజిల్‌లో(Brazil) రఫేల్ డోస్ సాంటోస్ టోస్టా(Rafael dos Santos Tosta) అనే కుర్రాడున్నాడు. అతడు పెళ్లి గురించి బోల్డన్ని కలలు కన్నాడు. సంసార జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశతోనే చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకే అతడికి తత్వం బోధపడింది. రోజూ భార్యతో గొడవలు పడలేక విడాకుల కోసం కోర్టు తలుపు తట్టాడు. న్యాయస్థానం ఇద్దరి వాదనలు విన్నది.
చివరకు విడాకులు మంజూరు చేసింది. 22 ఏళ్ల ఆ యువకుడు తెగ సంబరపడ్డాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇక ఛస్తే పెళ్లి(Marriage) జోలికి వెళ్లకూడదని ఒట్టేసుకున్నాడు. ఇక జీవితాంతమూ ఆనందంగా గడపాలని డిసైడయ్యాడు. ఆ సంతోషంతోనే కాంపో మాగ్రో లో ఉన్న లగోవా అజుల్ అనే టూరిస్టు ప్లేస్‌కు వెళ్లాడు. అక్కడ బంగీజంప్ చేశాడు.
గ్రహచారం బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందంటారుగా! తాడు పాము కాలేదు కానీ 70 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పుటుక్కుమని తెగింది. పాపం అంత ఎత్తునుంచి దబెల్‌మని నీట మడుగులో పడ్డాడు. ఈ ప్రమాదంలో మెడ, నడుము ఎముకలు విరిగిపోయాయి. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ప్రమాదం ఫిబ్రవరి 11న జరిగింది. ఇది జరిగి మూడు నెలలు అవుతున్నా అతడు మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇప్పటికీ నిటారుగా నిలబడలేకపోతున్నాడు. సొంతంగా లేవలేకపోతున్నాడు. ఫిజియోథెరపిస్టులు చికిత్స చేస్తున్నాడు. పెళ్లికి ముందు కామ్‌గా ఉండే తాను పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయానని రఫేల్(Raphael) చెబుతున్నాడు.
విడాకుల తర్వాత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేద్దామనుకున్నాను కానీ ప్రమాదం తనను ఇలా మారుస్తుందని అనుకోలేదని అన్నారు. అలా తిరగొద్దురా అంటూ తన తల్లి, కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదని, అందుకు తగినశాస్తి జరిగిందని తెలిపాడు. నొప్పుల కారణంగా రాత్రి పూట కూడా సరిగ్గా నిద్ర రావడం లేదన్నాడు. అంతపెద్ద ప్రమాదం జరిగిన ఇంకా బతికి ఉండటం తన అదృష్టమని తెలిపాడు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు