Eye of Brahma Diamond : ఈ వజ్రం ఉంటే.. చావుని కొని తెచ్చుకున్నట్టే.!
నలుపురంగులో ఉన్న పెద్ద వజ్రమది! పేరు ది బ్లాక్ ఓర్లోవ్ డైమండ్.. ప్రపంచంలో అతి పెద్ద బ్లాక్ డైమండ్ల చిట్టా తీస్తే ఇది ఏడో స్థానంలో ఉంటుంది. దీనికి ఐ ఆఫ్ బ్రహ్మ అనే మరో పేరు ఉంది. అచ్చ తెలుగులో చెప్పాలంటే బ్రహ్మ కన్ను.. ఎందుకంటే ఒకప్పుడు ఇది పుదుచ్చేరిలో ఉన్న ఓ ఆలయంలోని బ్రహ్మదేవుడి విగ్రహం నుదిటపై ఉండేదట! ఓ సన్యాసి ఈ వజ్రాన్ని పెకిలించుకుని వెళ్లాడట! పాపం ఈ వజ్రం ఎవరి దగ్గర […]
నలుపురంగులో ఉన్న పెద్ద వజ్రమది! పేరు ది బ్లాక్ ఓర్లోవ్ డైమండ్.. ప్రపంచంలో అతి పెద్ద బ్లాక్ డైమండ్ల చిట్టా తీస్తే ఇది ఏడో స్థానంలో ఉంటుంది. దీనికి ఐ ఆఫ్ బ్రహ్మ అనే మరో పేరు ఉంది. అచ్చ తెలుగులో చెప్పాలంటే బ్రహ్మ కన్ను.. ఎందుకంటే ఒకప్పుడు ఇది పుదుచ్చేరిలో ఉన్న ఓ ఆలయంలోని బ్రహ్మదేవుడి విగ్రహం నుదిటపై ఉండేదట! ఓ సన్యాసి ఈ వజ్రాన్ని పెకిలించుకుని వెళ్లాడట! పాపం ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారికి కీడు జరుగుతుందన్న విషయం ఆ సన్యాసికి తెలియదు. తెలిస్తే ఆ దొంగతనం చేసి ఉండేవాడు కాదేమో! బ్రహ్మకన్నును దొంగిలించిన ఆ సన్యాసి కొద్ది కాలానికే హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఈ వజ్రం రష్యాకు చేరింది. అక్కడ్నుంచి చేతులు మారుతూ యూరప్‌కు చేరుకుందా నల్ల వజ్రం. 1932లో యూరోపియన్ వజ్రాల డీలర్ అయిన జేడబ్ల్యూ పారిస్ దీన్ని కొనుక్కున్నాడు.. ముచ్చటగొలుపుతున్న ఆ వజ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లాడు. కారణాలు తెలియదు కానీ కొద్ది రోజులకే ఓ పెద్ద బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు పిమ్మట ఈ వజ్రం ఎలా చేరిందో ఏమో కానీ మళ్లీ ప్యారిస్‌కు చేరింది..
జేడబ్ల్యూ పారిస్ దుర్మరణం చెందిన 15 ఏళ్ల తర్వాత ఈ వజ్రం రష్యా రాజకుమార్తెలు లియోనిలా బరియటిన్‌స్కీ, నదియా వ్యేగిన్ ఓర్లోవ్ చేతుల్లోకి వెళ్లింది. విచిత్రమేమిటంటే ఈ రాజకుమార్తెలిద్దరూ కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నారు.ఈ వజ్రాన్ని చివరిసారిగా నదియా వ్యేగిన్ ఒర్లోవ్ ధరించింది కాబట్టే దీనికి బ్లాక్ ఓర్లోవ్ అని పేరు వచ్చింది. అప్పటికే ఈ వజ్రంపై బోలెడన్ని ప్రచారాలు జరిగాయి. ఈ వజ్రం ఎవరి చెంత ఉంటే వారు మరణించడం తథ్యమని జనం నమ్మసాగారు. 1950 ప్రాంతంలో చార్లెస్ విల్సన్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని కొన్నాడు. కొనడమైతే చేశాడు కానీ ఏం జరుగుతుందోన్న భయం అతడిని వెంటాడింది. అందుకే ఆ వజ్రాన్ని మూడు ముక్కలు చేయించాడు. నిజానికి ఆ పెద్ద వజ్రం బరువు 195 క్యారెట్లు. మూడు ముక్కల్లో అతి పెద్ద వజ్రమే ఇప్పుడున్న బ్లాక్ ఓర్లోవ్. దీని బరువు 67.69 క్యారెట్లు. మిగతా రెండు ముక్కలు ఏమయ్యాయో, ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరికీ తెలియదు. కొన్నేళ్లపాటు బ్లాక్ ఓర్లోవ్‌ను భరించిన విల్సన్ 1969లో ఓ గుర్తు తెలియని వ్యక్తికి 2.45 కోట్లకు అమ్మాడు. అటు పిమ్మట చాలా కాలం పాటు ఈ వజ్రం గురించిన వార్తలు బయటకు రాలేదు.. ఈ వజ్రం కూడా ఎవరి కంటా పడలేదు.
1990లో హఠాత్తుగా ఈ వజ్రం మళ్లీ తెరమీదకు వచ్చింది. సదబీజ్ సంస్థలో వేలానికి వచ్చింది. అప్పుడీ వజ్రాన్ని వేలంలో కేవలం 80 లక్షలిచ్చి కొన్నాడో వ్యక్తి. కాకపోతే అయిదేళ్ల తర్వాత జరిగిన వేలంలో మాత్రం ఈ వజ్రం 12.25 కోట్లకు అమ్ముడయ్యింది. 2004లో అమెరికాకు చెందిన డెన్నిస్ పెటిమెజాస్ పెద్ద మొత్తం ఇచ్చి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. ఏ దుస్సంఘటనలు జరిగాయో తెలియదు కానీ రెండేళ్లకే దీన్ని 2.9 కోట్లకు అమ్మేశాడు. ఇంత భయంకరమైన వజ్రాన్ని మొన్నీమధ్య న్యూయార్క్, లండన్‌లలో జరిగిన నేచురల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ వజ్రాన్ని చూసి ఆనందించారే తప్ప కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రాణాలు పోతాయన్న భయమే అందుకు కారణం. ఇంతకీ ఇది భారత్‌లో దొరికిన వజ్రమేనా? ఎందుకంటే ఇప్పటి వరకు మనదేశంలో నల్ల వజ్రాలు దొరకలేదు. అందుకే ఇది భారత్‌కు చెందింది కాదని కొంత మంది వాదిస్తుంటారు. బ్లాక్ ఓర్లోవ్ భారత్‌లో దొరికిన మాట వాస్తవమేనని, దీనికి బ్రహ్మ ఇచ్చిన శాపం కూడా నిజమేనని చాలా మంది నమ్ముతుంటారు..