ప్రధాని మోడీ-పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ..!

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాల నేతలకు కూడా ఆహ్వానించారు. దీంతో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ, పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన తర్వాత మోడీ అక్కడికి చేరుకున్నారు. వేదికపై ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాల అధినేతలకు నమస్కరిస్తూ వెళ్లిన మోడీ పవన్ వద్దకు వచ్చిన వెంటనే ఆయనకు షేక్ హ్యాండిచ్చారు. పవన్ ధరించిన సనాతన ధర్మ వస్త్రధారణను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మోడీ పవన్‌తో కాసేపు ముచ్చటించారు. మోడీ వ్యాఖ్యలకు బదులిస్తూనే పవన్ పడిపడి నవ్విన విజువల్స్ వైరలయ్యాయి. దీంతో అసలు మోడీ, పవన్‌తో ఏం మాట్లాడారో అన్న ఆసక్తి రేగింది. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోతున్న పవన్‌ను నేషనల్ మీడియా చుట్టుముట్టింది. మీతో ప్రధాని మోడీ ఏం మాట్లాడారు అంటూ పలువురు మీడియా ప్రతినిధులు పవన్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోడీతో తన సంభాషణను పవన్ వివరించారు. మోడీ గారు నన్ను చూడగానే నవ్వుతూ, ఏంటి అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకుంటున్నారా? అని అడిగారని పవన్ చెప్పారు. అయితే ”అలాంటిది ఏమీ లేదు” అని జవాబిచ్చినట్లు పవన్ వివరించారు. దానికి ఇంకా చాలా సమయం ఉంది, ముందు ఇవన్నీ చూసుకోవాలని తనతో మోడీ అన్నట్లు మీడియాకు పవన్ వివరించారు.
