✕
Happy Birthday Allu Arjun : పుష్పార్జునుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
By EhatvPublished on 8 April 2023 3:41 AM GMT
కొందరి పుట్టినరోజులు కలంపాళీలో కలకలం రేపుతాయి. ప్రతీ అక్షరాన్ని కలవరపెడతాయి. వాళ్ళ గురించి రాసే అక్షరాల వెనుక గూఢంగా, నిగూఢంగా ఉడికెత్తే ఆలోచనలను వెల్లువలా పరిగెత్తిస్తాయి. అందుకు కారణం-అటువంటి వ్యక్తులలో ఉన్న తెరలుతెరలుగా శెగలెత్తే ఎనర్జీ!

x
Happy Birthday Allu Arjun
-
- కొందరి పుట్టినరోజులు కలంపాళీలో కలకలం రేపుతాయి. ప్రతీ అక్షరాన్ని కలవరపెడతాయి. వాళ్ళ గురించి రాసే అక్షరాల వెనుక గూఢంగా, నిగూఢంగా ఉడికెత్తే ఆలోచనలను వెల్లువలా పరిగెత్తిస్తాయి. అందుకు కారణం-అటువంటి వ్యక్తులలో ఉన్న తెరలుతెరలుగా శెగలెత్తే ఎనర్జీ! ఆ ఎనర్జీతో వారెందరిలోనో కెరటాల జోరుతో ప్రకంపనలు పుట్టిస్తారు. ఉరకలు వేయిస్తారు. అటువంటి సంచలనాత్మక కథానాయకుడే అల్లు అర్జున్.
-
- అల్లు అర్జున్ కేవలం ఒక తెరమీద కదలాడే కథానాయకుడే కాదు. ఈ రోజున భారతదేశంమంతా అల్లు అర్జున్ పేరు చెబితే వెర్రెక్కిపోతున్నారంటే అల్లు అర్జున్‌లో ఉన్న ఆ ఎనర్జీయే కారణం. హీరోగా తెరంగేట్రం చేసినప్పటినుంచి ఈరోజు వరకూ అల్లు అర్జున్ తీరం దాటిన సునామీలా దూసుకొస్తునే ఉన్నారు. ఏ ఒక్క అడుగూ నిశ్శబ్దంగా పడలేదు. ఏ ఒక్క మలుపూ ఉదాసీనంగా తిరగలేదు. ప్రతీ అడుగులో మెరుపుల జడివాన. ప్రతీ మలుపులో పిడుగుల సుడిగాలి పెనుతుఫాను. అల్లు అర్జున్ సినిమా వస్తోందంటే సినిమా పరిశ్రమలో సందడి. అభిమానులకు పండగ వేడుక. తను పోషించే పాత్రకు తనదైన ప్రత్యేకతతో ప్రాణప్రతిష్ట చేసి, ఆ పాత్రను సినిమా ఘనవిజయానికి ఒక అస్త్రంలా ఉపయోగపెట్టిన సమున్నత శక్తివంతుడు అల్లు అర్జున్. అందుకే ప్రతీ సినిమా, దర్శకుడెవరైనా కావచ్చు, కథాకథనాలు ఏమైనా కావచ్చు, అల్లు అర్జున్‌లోని శక్తిసామర్ధ్యాలతో అద్భుతంగా పండుతూ వచ్చింది. గంగోత్రి చిత్రం మొదటి చిత్రంగా అనుకోకూడదు. ఎందుకంటే ఆ చిత్రంలో అల్లు అర్జున్ పెరఫారమెన్స్ ఆ సినిమాకి ఎంతగా ఉపకరించిందో చూస్తే ఒక నటుడిగా అల్లు అర్జున్ ఎత్తు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తొలి చిత్ర కథానాయకుడిగా కాదు, తొలి చిత్రంలోనే తనలోని మెరిట్ అండ్ టాలెంట్‌ని ఎంతగా ఆ చిత్ర విజయానికి కాపలా పెట్టాడో అల్లు అర్జున్.....హేట్సాఫ్ టు హిమ్.
-
- నటుడిగా వెయ్యి సినిమాలకు పైచిలుకు నటించి, యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్‌లో తనకు తానే సాటిగా ఆరితేరిన అల్లు రామలింగయ్యగారి ముద్దుల మనవడు...ఆయనలో అణువణువునా నిండిన ఒక మహానటుడి లక్షణాలను అన్నిటినీ ఆద్యంతం వారసత్వంగా పుణికిపుచ్చుకున్న సార్ధకతను తన ప్రతీ చిత్రంలోనూ అల్లు అర్జున్ హైలీ సక్సెస్‌ఫుల్‌గా నిరూపించుకుని అల్లు ఇంటిపేరును చిరస్థాయిగా నిలిపి, నటవంశోద్ధారకుడిగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. ఫాదర్ ఆలిండియా లెవెల్లో ఏస్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని రికార్డులను నెలకల్పిన నేపథ్యం అల్లు అర్జున్‌కి మెండుగా ఉంది.
-
- అల్లు అరవింద్ అంటే భారతీయ చిత్రపరిశ్రమలో పేరెన్నికగన్న కీర్తప్రతిష్టలకు ఒక చెరగని చిరునామా! అటువంటి అగ్రనిర్మాత కడుపున పుట్టిన, చిత్రపరిశ్రమకు సరికొత్తగా వచ్చనట్టుగా, అల్లు అర్జున్ ప్రతీ చిత్రం కోసం, ప్రతీ పాత్రను పండించడం కోసం పడని ప్రయాస లేదు. ఉదాసీనతకు తావు లేని నిరంతరం పోరాటం చేయడం అల్లు అర్జున్‌లోని జీవలక్షణం. త్రండ్రి నేపథ్యం తన కెరీర్ ఎదుగుదలకు తోడ్పాటుగా ఏ క్షణంలోనూ పరిగణించని పరిపక్వతే అల్లు అర్జున్ రైజ్‌కి మెయిన్ రీజన్. దర్శకుడి ముందు తానెప్పుడూ ఓ నిత్య విద్యార్ధిలా బుద్ధిగా, శ్రద్ధగా నిలబడి, ప్రతీ మెలకువనూ ఒడుపుతో నేర్చుకుని మరీ రాణించాడు అల్లు అర్జున్. దర్శకరచయితలు సృష్టించిన కథాగమనంలో తన పాత్రను గడుసుగా అనుసరించి, ప్రతీ పాత్రనూ రక్తి కట్టించి, తనకు తానే సాటిగా రుజువు చేసుకున్న ఒక స్క్రీన్ ఛాంపియన్ అల్లు అర్జున్.
-
- గంగోత్రితో తొలి ముహూర్తం జరుపుకుని, మలి చిత్రం నుంచి నిన్నమొన్నటి ఆలిండియా రికార్డుతో జాతీయస్థాయిలో మేటి కథానాయకుడిగా అల్లు అర్జున్ చేస్తున్న ప్రయాణంలో, దాటుతున్న మార్గంలో ఎన్నో మైల్‌స్టోన్స్....మరెన్నో ల్యాండ్ మార్క్స్!! ఆర్య, హేపీ, ఎవడు, సరైనోడు, డిజె, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతో అనుక్షణం ఎదుగుతూ, విజయాల మాటున ఒదుగుతూ పరిగెడుతున్న రేసుగుర్రం అల్లు అర్జున్ కెరీర్. తనకని తన అభిమానులను అసంఖ్యాకంగా గెలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా అల్లు అర్జున్ పేరు చెబితే చాలు ఓ వెర్రికేక పుడుతుంది. అ కేక తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తుంది. గ్లోబల్ స్టార్‌డమ్‌ను అతితక్కువ కాలంలో సాధించిన తెలుగువారి సగర్వ కథానాయకుడు అల్లు అర్జున్.
-
- అల వైకుంఠపురం చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను సాధించి తన పేరును తెలుగు సిసీచరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మలుచుకున్న ఘనత తనది. పరాకాష్ట....పుష్ఫ. అఖిలభారతీయస్థాయిలో అన్ని భాషాపరివ్రమకూ పుష్ప పాత్రతో, తన అసమానమైన నటనా వైదుష్యాన్ని కలబోసి, ఎకాఎకిన ఐకాన్ స్టార్‌గా అపూర్వమైన ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం ఒక చరిత్ర. అయితే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్....వంటి టైటిల్స్ అల్లు అర్జున్‌కి అత్యంత సర్వసాధారణం. ఇంకా సమున్నతమైన కీర్తికి, టైటిల్స్‌కి అల్లు అర్జున్ అన్ని ఆర్హతలూ నిండుగా, మెండుగా ఉన్న పరిపూర్ణమైన కథానాయకుడు అల్లు అర్జున్. మొన్నీ మధ్యనే 20 ఏళ్ళ నటజీవితాన్ని పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌కి చిత్ర పరిశ్రమంతా ఈ రోజు పుట్టినరోజున ముక్తకంఠంతో శుభాకాంక్షలు తెలుపుతోంది. ఒక్క తెలుగు చిత్రపరిశ్రమే కాదు...యావత్తు భారతీయ చిత్రపరిశ్రమ కూడా వంత పాడుతోంది. .హేపీ బర్త్‌డే టు యు బన్నీ.... " Written By : Nagendra Kumar "

Ehatv
Next Story