అయిదేళ్ల వయసున్న యూకేజీ విద్యార్థి(UKG Student) పోలీస్ కానిస్టేబుల్(Police Constable) కాగలడా? చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో ఇది సాధ్యమయ్యింది. సర్గుజా జిల్లాకు చెందిన నమాన్ రాజ్వాడే ఈ మధ్యనే పోలీస్ కానిస్టేబుల్‌గా నియామక పత్రాన్ని స్వీకరించాడు కూడా! అసలేం జరిగిందంటే ఈ పిల్లోడి తండ్రి రాజ్‌కుమార్ రాజ్వాడే కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాడు. కొన్ని రోజుల కిందట విధి నిర్వహణలో ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చత్తీస్‌గఢ్ పోలీస్‌శాఖ(Chhattisgarh Police Department) నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద నమాన్ రాజ్వాడేను ఉద్యోగంలో తీసుకున్నారు. ఇలాంటి సందర్భాలలో మరణించిన వ్యక్తి కుటుంబంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసుగల వారుంటే ఉద్యోగావకాశాన్ని కల్పిస్తామని సర్గుజా జిల్లా ఎస్పీ భావనా గుప్తా చెప్పారు. ఆ బాలుడికి 18 ఏళ్లు వచ్చాక పూర్తిస్థాయి విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఇదే చత్తీస్గడ్లోఈ ఏడాది జనవరిలోనూ తండ్రి అకాలమరణంతో అయిదేళ్ల మరో చిన్నారిని ఛైల్డ్ కానిస్టేబుల్(Child constable)గా ప్రభుత్వం నియమించింది.
ఆదాయ పన్ను(Income Tax Slab) చెల్లింపుదారులకు ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు కాసింత ఊరట కలిగిస్తూ ఆర్ధిక బిల్లు 2023(Finance Bill 2023)లో సవరణలు చేసింది. బడ్జెట్ (budget proposals) ప్రతిపాదనల ప్రకారం పన్ను వర్తించే ఆదాయం ఏడు లక్షల రూపాయల వరకు ఉన్నప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఏడు లక్షల రూపాయలకు మించి వంద రూపాయలు ఉన్నా సదరు వ్యక్తి 25, 010 రూపాయల వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే కొత్త సవరణ ప్రకారం ఏడు లక్షల రూపాయలకు మంచి మరో పాతిక వేలు అధిక ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, ఈ అదనపు ఆదాయానికి మినహాయింపు ఎంత అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆ అమ్మాయిని చూసి మైండ్ బ్లాంక్ అయ్యిందిరా అంటూ ఉంటారు కదా! నిజంగానే అందమైన అమ్మాయిలను చూస్తే మెదడు పని చేయకుండా ఉంటుందా? అన్న అనుమానం నెదర్లాండ్స్(Netherland)లోని రాడ్బౌండ్ యూనివర్సిటీ(Radboud University) పరిశోధకులకు వచ్చింది. వెంటనే పరిశోధన మొదలు పెట్టారు. అందమైన అమ్మాయి కనిపించగానే మగాళ్లకు కాసేపు మెదడు పని చేయదని పరిశోధనలో తేలింది. ఎక్స్పెరిమెంటల్ అండ్ సోషల్ సైకాలజీ అనే జర్నల్(ournal of Experimental Social Psychology)లో ఈ వివరాలను ప్రచురించారు. అందమైన పడతుల దగ్గర కొన్ని నిమిషాలు ఉన్నా ఈ పరిస్థితి తలెత్తుతుందట. 40 మంది మగాళ్లతో పరిశోధకులు ఓ ప్రయోగం చేశారు. వీరిని ఏడు నిమిషాల చొప్పున పురుషులతో ఓసారి, అందమైన అమ్మాయిలతో మరోసారి మాట్లాడించారు. ఆ వెంటనే జ్ఞాపకశక్తి (Memory) పరీక్ష నిర్వహించారు. విచిత్రమేమిటంటే అమ్మాయిలతో మాట్లాడిన వారిలో చాలా మంది తక్కువ స్కోరు సాధించారు. అందుకు కారణమేమిటంటే అమ్మాయిలకు అట్రాక్ట్ అయిన యువకులకు ఆ సమయంలో మెదడులోని కాగ్నిటివ్ ఫంక్షన్‌ను కాసేపు కోల్పోవడమేనట!
అఫ్గనిస్తాన్(Afghanistan)తో జరిగిన తొలి టీ-20(1st T20) మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakistan) పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ జట్టులో సీనియర్లు లేకపోవడంతో అఫ్గనిస్తాన్ సునాయాసంగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ట్వంటీ ఓవర్స్‌లో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత బరిలో దిగిన అఫ్గనిస్తాన్ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. టీ -20లలో పాకిస్తాన్‌ను అఫ్గనిస్తాన్ ఓడించడం ఇదే మొదలు. మరో విషయమేమిటంటే టీ-20లలో పాకిస్తాన్ ఇది అయిదో అత్యల్ప స్కో కావడం. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మహ్మద్ నబీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ-20 ఆదివారం జరుగుతుంది.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బొగ్గులకుంట కామినేని హాస్పిటల్ పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు గ్యారేజ్ మొత్తానికి వ్యాపించాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదులులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు సజీవదహనం కావడం విషాదం. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.