రెండేళ్ల కిందట మలయాళంలో మిన్నల్‌ మురళి అనే సినిమా వచ్చింది. తెలుగు కూడా ఈ సినిమా డబ్‌ అయ్యింది. ఇందులో హీరో జేసన్‌, ప్రతినాయకుడు శిబు. ఒకరోజు అనుకోకుండా వీరిద్దరూ పిడుగుపాటుకు గురవుతారు. దీంతో ఇద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. లేటెస్ట్‌గా వీరన్‌ అనే సినిమా వచ్చింది. మనిషిపై పిడుగు పడితే ఎలాంటి శక్తులు వచ్చాయన్నది సినిమా కథ. ఇందులో హీరో 15 ఏళ్ల వయసులో పిడుగుపాటుకు గురవుతాడు.

రెండేళ్ల కిందట మలయాళంలో మిన్నల్‌ మురళి అనే సినిమా వచ్చింది. తెలుగు కూడా ఈ సినిమా డబ్‌ అయ్యింది. ఇందులో హీరో జేసన్‌, ప్రతినాయకుడు శిబు. ఒకరోజు అనుకోకుండా వీరిద్దరూ పిడుగుపాటుకు గురవుతారు. దీంతో ఇద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. లేటెస్ట్‌గా వీరన్‌ అనే సినిమా వచ్చింది. మనిషిపై పిడుగు పడితే ఎలాంటి శక్తులు వచ్చాయన్నది సినిమా కథ. ఇందులో హీరో 15 ఏళ్ల వయసులో పిడుగుపాటుకు గురవుతాడు. ఆ షాక్‌ నుంచి తేరుకున్న తర్వాత అతడికి కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులతో ఈ సూపర్‌ హీరో విలన్స్‌ నుంచి గ్రామాన్ని రక్షించుకుంటాడు.. ఈ రెండు కథలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఎక్కడైనా పిడుగుపడితే మనుషులు చచ్చిపోతారు కానీ అతీంద్రయ శక్తులు రావడమేమిటి? అని లాజిక్‌లను వెతకొద్దు.. ఎందుకంటే ఇవి సినిమాలు కాబట్టి.. కానీ నిజంగా జరిగిన కొన్ని సంఘటలను చూస్తే పిడుగు వల్ల అప్పుడప్పుడు మంచి కూడా జరుగుతుందని తెలుస్తోంది. అమెరికాకు చెందిన మేరీ క్లామ్సర్‌ జీవిత కథే ఇందుకు మంచి ఉదాహరణ. నిజంగానే ఆమెది అంతుచిక్కని, నమ్మశక్యం కాని కథ..
అమెరికాలోని ఒక్లహోమాలో ఉండేవారు మేరీ క్లామ్సర్‌. 19 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె మట్టిపుల్‌ స్క్లేరోసిస్‌ (multiple sclerosis)కి గురయ్యారు. ఆ భయంకరమైన వ్యాధి ముదిరేకొద్దీ కాళ్లు చచ్చుబడిపోతాయని, నడవలేని స్థితికి చేరుకుంటారని, పిల్లలు పట్టడం కూడా కష్టమేనని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు చెప్పింది వినగానే మేరీ ఒక్కసారిగా కూలబడిపోయారు. కుమిలికుమిలి ఏడ్చారు. ఇది జరిగిన కొన్ని నెలల కిందటే ఆమె ప్రేమించిన రాన్‌ క్లామ్సర్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. తనకు సోకిన వ్యాధి కారణంగా రాన్‌ జీవితం నాశనం కావద్దని భావించారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందమని రాన్‌తో చెప్పారు. తనను మర్చిపోవాలంటే ప్రాధేయపడ్డారు. రాన్‌ను మేరీ ఎంత ప్రేమిస్తున్నారో .. మేరీని అంతకు మించి రాన్‌ ప్రేమిస్తున్నారు. అందుకే మేరీ ప్రతిపాదనను రాన్‌ కాదన్నారు. నువ్వు ఎలా ఉన్నా తనకు కావాలన్నారు. ఏదేమైనా కలిసే బతుకుదామంటూ నచ్చచెప్పారు. రాన్‌ వంటి వ్యక్తి తన జీవితాన్ని పంచుకోవాలని వస్తుంటే కాదని చెప్పడం ఎందుకని ఓప్పేసుకున్నారు మేరీ. రాన్‌ చేయి అందుకున్నారు. ఇద్దరూ ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. వ్యాధి నెమ్మదిగా ముదురుతున్న విషయాన్ని పసికట్టారు మేరీ. వంట్లో శక్తి నెమ్మదిగా హరించుకుపోవడం మొదలయ్యింది. అయినా ఓపిక తెచ్చుకుని భర్తతో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించేవారు మేరీ. వివాహం జరిగిన పదేళ్ల కాలంలో ముగ్గురు పిల్లల తల్లయ్యారు మేరీ. ప్రతీ ప్రసవానికి ఆమె నరకయాతన పడ్డారు. పిల్లల కోసం బాధనంతా పంటికింద భరించారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. ముగ్గురూ ఆరోగ్యంగా పుట్టారు. క్యాలెండర్‌లో సంవత్సరాలు మారుతున్నాయి. ఆమె వ్యాధి కూడా ముదరసాగింది. ఎడమ కాలైతే పూర్తిగా చచ్చుపడపోయింది. నడవడం సంక్లిష్టమయ్యింది. 42 ఏళ్లు వచ్చేసరికి కుడి కాలు కూడా బలహీనపడింది. లేచి నిలవడటం కష్టంగా మారింది. వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. అలా రెండేళ్లు గడిచాయి. అప్పుడు నమ్మశక్యం కాని ఓ సంఘటన జరిగింది.
1994, ఆగస్టు 17వ తేదీ.. ఆ రోజు మామూలుగా లేదు. భయంకరమైన వర్షం.. దానికి తోడు భీకరమైన ఉరుములు. మెరుపులు. లేని శక్తిని కూడదీసుకుని చిన్న చిన్న పనులన్నింటినీ పూర్తి చేశారు మేరీ. స్నానం చేయడానికి ఇంటి బయట ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా ఆకాశంలోంచి ఓ పిడుగు పడింది. పదివేల వోల్టుల విద్యుత్‌ వంటి నుంచి ప్రవహించింది. ఆ దెబ్బకు మేరీ నేల మీద పడిపోయింది. కాసేపయ్యాక కుటుంబసభ్యులు మేరీని ఆ స్థితిలో చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమె పరిస్థితి చూసి ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించారు. రెండు రోజుల తర్వాత ఆమె కళ్లు తెరిచింది. రౌండ్స్‌కి వచ్చిన డాక్టర్‌ ఆమెకు తగిలిన గాయాలకు మందు పూస్తున్నాడు. ఆమె ఎడమకాలిని డాక్టర్‌ తాకినప్పుడు ఆమెకు స్పర్శ తెలిసింది. ఎన్నో ఏళ్లుగా చచ్చుబడిన ఆ కాళ్లలో చిన్న కదలికలు. అది చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. నెల రోజుల తర్వాత ఆమె చిన్నగా నడవడం మొదలుపెట్టారు. ఏడాదిలోపే ఆమె ఎవరి సాయం లేకుండా కాళ్లకు ఎలాంటి సపోర్ట్‌ లేకుండా చాలా దూరం నడవసాగారు. అది చూసి కుటుంబసభ్యులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. వ్యాధి సోకడానికి ముందు ఎలా ఉన్నారో అలా అయ్యారు మేరీ.. తన జీవితంలో జరిగింది ఓ అద్భుతమైన నమ్మారు. పిడుగుపాటు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన వైనాన్ని పది మందికి చెప్పాలనుకున్నారు. అందుకు 1995, ఏప్రిల్‌ 19వ తేదీని ఎంచుకున్నారు. తన ఇంటి దగ్గరలో ఉన్న అల్ఫ్రెడ్‌ పి. ముర్రా ఫెడరల్‌ బిల్డింగ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ మరికాసేపట్లో ప్రారంభమవుతుందనగా ఉగ్రవాదులు ఆ బిల్డింగ్‌పై బాంబులు విసిరారు. ఆ దుర్ఘటనలో 168 మంది అమాయకులు చనిపోయారు. ఇది చూసి మేరీ షాకయ్యారు. తనకు జరిగిన అద్భుతం దైవ రహస్యమని, ఇతరులకు చెబితే తనకే ప్రమాదమని ఆ క్షణాన భావించారు. అందుకే ఆ తర్వాత ఏ ఇంటర్వ్యూకీ ఆమె ఒప్పుకోలేదు.
2003లో మేరీలో మళ్లీ ఆ వ్యాధి లక్షణాలు మొదలయ్యాయి. మరోసారి కాళ్లు చచ్చుబడిపోయాయి. లేచి నడవటం కష్టంగా మారింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇంటి బయట ఉన్న ఆమెపై మళ్లీ పిడుగుపడింది. ఆశ్చర్యమేమింటే ఆమె పిడుగుపాటు నుంచి క్షేమంగా బయటపడమే కాకుండా మళ్లీ కోలుకుని నడవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా ఆమె ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. మళ్లీ పిడుగుపాటుకు గురి కాకుండా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉండసాగారు మేరీ. 2016లో రాన్‌ తన 68 ఏట అనారోగ్యంతో చనిపోయారు. తర్వాత కొడుకు క్రిస్టోఫర్‌ కూడా కన్నుమూశారు. అప్పుడు కూడా మేరీ వివరాలు బయటకు రాలేదు. ఇప్పుడు మేరీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఉన్నారో చనిపోయారో కూడా తెలియదు. ప్రాణాలతో ఉంటే ఆమెకు 70 ఏళ్లు ఉంటాయి. పిడుగుపాటుకు గురైతే ఎవరైనా చనిపోతారు. కానీ మేరీకి ఏమీ కాకపోగా, కొత్త శక్తులు రావడం, ఉన్న వ్యాధులు నయం కావడం ఓ అద్భుతం అయితే, ఆ నిజాన్ని మేరీ ప్రపంచానికి చెప్పాలనుకున్న రోజే బాంబు దాడి జరగడం మరో మిస్టరీ! మేరీకి జరిగినట్టే ఇద్దరి ముగ్గురికి కూడా ఇలాగే జరిగింది. అమెరికాలోని అలబామాకు చెందిన ఫెయిత్‌ మోబ్లీ కూడా పిడుగుపాటుకు గురైంది. మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్న సమయంలో ఆమెపై పిడుగుపడింది. ఆమె మరణాన్ని జయించడమే కాదు అప్పటి వరకు బలహీనంగా ఉన్న కంటి చూపు ఆ దెబ్బతో మెరుగుపడింది.. రూబెన్‌ స్టీఫెన్సన్‌ అనే రైతుకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. పొలంలో ఉన్నప్పుడు పిడుగు పడింది. ఆశ్చర్యమేమింటే ఆ పిడుగుపాటుకు అతడి పక్కనే ఉన్న రెండు గుర్రాలు చనిపోయాయి. రూబెన్‌కు మాత్రం ఏమీ కాలేదు. పైగా అప్పటి వరకు పెదవిపై ప్రాణాంతక మెలనోమా వ్యాధితో బాధపడుతున్న స్టీఫెన్‌సన్‌ ఆ తర్వాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడట! అమెరికాలోని జెర్సీలో ఒక పోలీసు అధికారిపై కూడా పిడుగుపడింది. అప్పుడతడి కోటు కాలిపోయింది. ఇత్తడి బటన్లు పూర్తిగా కరిపోయాయి. కానీ అతడికి మాత్రం ఏమీ కాలేదు. మరో అద్భుతమేమిటంటే అప్పటి వరకు అతడికి ఉన్న వాతం, అజీర్తి మాటుమాయం కావడం.. ఈ ఘటనలు తర్కానికి అందనివే అయినా, నమ్మశక్యంగా లేకపోయినా నమ్మి తీరాలి. ఎందుకంటే ఇవి నిజంగా జరిగిన సంఘటనలు..

Updated On 4 July 2023 4:35 AM GMT
Ehatv

Ehatv

Next Story