Oil Wrestling : ఆయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గురించి తెలుసా? ఏమిటా మల్లయుద్ధపు ప్రత్యేకత?
ప్రతి ఏడాది జులై మొదటివారం టర్కీలో ఓ క్రీడా వేడుక జరుగుతుంది. క్రీడా వేడుక ఎందుకనాల్సి వచ్చిందంటే అందులో క్రీడ ఉంటుంది. ప్లస్ వేడుకా ఉంటుంది. టర్కీలోని ఎడిర్నేలో జులై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి. ఈ మల్లయుద్ధ పోటీలు బహు విచిత్రంగా ఉంటాయి. దీన్ని గ్రీజు రెజ్లింగ్ అని కూడా అంటారు. అన్నట్టు ఇది టర్కీ జాతీయ క్రీడ.పోటీలో పాల్గొనే మల్లయుద్ధ వీరులంతా తమ ఒంటికి ఒలివ్ ఆయిల్‌ను దట్టంగా పూసుకుంటారు.
అసలు మల్లయుద్ధంలోనే మజా ఉంటుంది.. అందుకేగా దంగల్ సినిమా అన్నేసి కోట్లు కలెక్ట్ చేసింది.ఆ మల్లయుద్ధపు పోటీల్లోనే కాసింత తైలాన్ని జోడిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా! ఈ ఐడియా టర్కీ వాసులకు ఏనాడో వచ్చింది. శతాబ్దాలుగా అక్కడ ఆయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం!
ప్రతి ఏడాది జులై మొదటివారం టర్కీలో ఓ క్రీడా వేడుక జరుగుతుంది. క్రీడా వేడుక ఎందుకనాల్సి వచ్చిందంటే అందులో క్రీడ ఉంటుంది. ప్లస్ వేడుకా ఉంటుంది. టర్కీలోని ఎడిర్నేలో జులై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి. ఈ మల్లయుద్ధ పోటీలు బహు విచిత్రంగా ఉంటాయి. దీన్ని గ్రీజు రెజ్లింగ్ అని కూడా అంటారు. అన్నట్టు ఇది టర్కీ జాతీయ క్రీడ.పోటీలో పాల్గొనే మల్లయుద్ధ వీరులంతా తమ ఒంటికి ఒలివ్ ఆయిల్‌ను దట్టంగా పూసుకుంటారు. అప్పుడు కానీ బరిలో దిగరు..
ఇతరదేశాల్లో నివసించే టర్కిష్ వాళ్లంతా ఈ ఆయిల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించుకుంటారు కానీ.. టర్నీలో ఎడిర్నేలో పోటీల్లోనే ఉంటుంది అసలు మజా! ఇందులో పాల్గొనే మల్ల యోధులను పహిల్వాన్ అంటారు. అంటే హీరో అన్నమాట! చేత్తో కుట్టిన ఓ పెద్ద నిక్కరు వేసుకుంటారు. దున్న చర్మంతో ఈ నిక్కరును రూపొందించడం సంప్రదాయమే కానీ ఇప్పుడు మాత్రం దూడ చర్మంతో కుట్టిన ఓ పొడవాటి నిక్కర్లను ధరిస్తున్నారు. వీటిని కిస్బెట్ అంటారు. కొన్ని ప్రాంతాలలో కిస్పెట్ అని కూడా పిలుస్తారు.
ఒలింపిక్ రెజ్లింగ్ పోటీల్లాగా తెగ పట్లు పట్టేసుకోరు. ఎంత లాఘవంగా ప్రత్యర్థి కిస్బెట్‌ను పట్టుకుంటారో వాడే విజేత ఇందులో! అందుకే బరిలో దిగిన యోధులిద్దరూ అప్రమత్తంగా ఉంటారు.. అవతలి వ్యక్తి చేతులను తమ కిస్బెట్ వరకు రాకుండా చూసుకుంటారు.. ప్రతిఘటిస్తారు.. గెలుపొందడానికి అవసరమయ్యే ఎత్తుగడను పాకా కజిక్ అంటారు.. పాకా కజిక్‌ను అమలు చేసిన వ్యక్తి విజేత అవుతాడన్నమాట! పాత రోజుల్లో అయితే ఈ పోటీకి నిర్ణీత కాలపరిమితి ఉండేది కాదు.. రోజంతా కుస్తీ పడుతూనే ఉండేవారు.. కొన్ని సందర్భాలలో రెండు రోజులు కొనసాగేది..విజేతను నిర్ణయించడం బహు కష్టంగా ఉండేది. సమ ఉజ్జీలు తలపడితే ఇలాగే ఉంటుంది. ఇలాగైతే లాభం లేదనుకున్న నిర్వాహకులు సమయాన్ని బాగా కుదించారు. 1975 నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం అర్హత పోటీలకు 40 నిమిషాలు. పహిల్వాన్ పోటీలకు 30 నిమిషాలను కేటాయించారు. అప్పటికీ ప్రత్యర్థులిద్దరూ కుస్తీలు పడుతూనే ఉన్నారనుకోండి.. మరో పావుగంట అదనపు సమయాన్ని ఇస్తారు.
ఈ ఆయిల్ రెజ్లింగ్ పోటీలకు సంవత్సరాల చరిత్ర ఉంది.. 1362 నుంచి ఎడిర్నేలో పోటీలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ వింత మల్లయుద్ధ పోటీలు ఇతర దేశాలకు విస్తరించాయి. గ్రీసులోని కొన్ని ప్రాంతాలలో...నెదర్లాండ్స్.. జపాన్ దేశాలలో ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. మళ్లీ టర్నీలో జరిగే పోటీల విషయానికి వద్దాం.. విజేతకు నగదు బహమతులు.. సత్కారాలు వంటివి ఉన్నా. పోటీలో పాల్గొనేవారు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించరు. పైగా పరస్పరం గౌరవించుకుంటారు.. ఉదాహరణకు వయసులో తనకంటే పెద్ద అయిన వ్యక్తిని ఒకరు ఓడించారే అనుకుందాం! గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తి చేతిని ఆప్యాయంగా ముద్దాడుతాడు.. దీవెనలను అందుకుంటాడు. టర్కీలో అక్కడక్కడ ఏడాది పొడవునా ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి కానీ.. జులై మొదటివారంలో జరిగే పోటీలే అసలు సిసలైన పోటీలు. ఇందులో పాల్గొనేందుకు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో వస్తారు.. ఇక వీటిని తిలకించడానికి వచ్చేవారితో స్టేడియం కిక్కిరిసిపోతుంది.. ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆసక్తే! అందుకే ఇన్నేళ్లయినా ఆ సంప్రదాయం పదిలంగా నిలుస్తూ వస్తోంది..