China : దొంగతనానికి వెళ్లాడు.. హాయిగా గుర్రుపెట్టి పడుకున్నాడు..
దొంగతనానికి వెళ్లిన వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. దొరక్కుండా ఉండేందుకు ప్లాన్లు వేసుకుంటారు. పాపం ఆ దొంగ చోరకళలో ఇంకా ఆరితేరలేదు కాబట్టే ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఎంచక్కా గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ సరదా సంఘటన చైనా(China)లో జరిగింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ ఇంట్లోని సొమ్మంతా దోచుకోవాలని ఓ దొంగ అనుకున్నాడు. అందుకు ప్లాన్ వేశాడు.
దొంగతనానికి వెళ్లిన వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. దొరక్కుండా ఉండేందుకు ప్లాన్లు వేసుకుంటారు. పాపం ఆ దొంగ చోరకళలో ఇంకా ఆరితేరలేదు కాబట్టే ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఎంచక్కా గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ సరదా సంఘటన చైనా(China)లో జరిగింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ ఇంట్లోని సొమ్మంతా దోచుకోవాలని ఓ దొంగ అనుకున్నాడు. అందుకు ప్లాన్ వేశాడు. అందరూ ఆదమరచి నిద్రపోతున్నారనుకుని రాత్రి ఇంట్లో దూరాడు. అతడు ఇంట్లోకి వెళ్లేటప్పటికీ ఎవరూ నిద్రపోలేదు. వారు నిద్రపోయేంత వరకు ఓ గదిలో వేచిచూశాడు. ఎంతకీ వారు పడుకోకపోయేసరికి ఓ సిగరేట్ ముట్టించుకున్నాడు. ఇంట్లోవారికి నిద్ర వచ్చిందో లేదో తెలియదు కానీ దొంగకు మాత్రం నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలోకి జారుకున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. అతగాడి గురక చప్పుడుకు ఇంట్లోని ఓ మహిళకు చటుక్కుమని మెలకువ వచ్చింది. ఆ చప్పుడు పక్కింట్లోనుంచి వచ్చి ఉంటుంది కాబోలనుకుని మళ్లీ పడుకుంది. రాన్రాను ఆ గురక చప్పుడు ఎక్కువ కావడంతో ఆమెకు డౌట్ వచ్చింది. ఇంట్లో ఎవరో ఉన్నారనుకుని అంతా వెతికింది. అప్పుడు గాఢ నిద్రావస్థలో ఉన్న దొంగ కనిపించాడు. వెంటనే ఆమె ఇంట్లోవాళ్లను నిద్రలేపి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆగమేఘాల మీద వచ్చిన పోలీసులు దొంగగారికి మెలకువపాట పాడి, ఆపై అరదండాలు తగిలించారు. అయితే అతడేమీ అమెచ్యూర్ దొంగ కాదట. ఇంతకు ముందు ఓ కేసులో జైలు శిక్ష అనుభవించినవాడేనట! జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడని పోలీసులు చెప్పారు. పాపం అతడికి ప్రాక్టీస్ పోయి ఉంటుంది. ఈ వార్త వెలుగులోకి రావడం, ఆపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఓవర్‌టైమ్ పని చేయకుండా ఉండాల్సింది అని ఒకరంటే, ఇంట్లో దూరాడే కానీ దొంగతనం చేయలేదుగా.. ఇందుకు పోలీసులు ఏ శిక్ష వేస్తారో అని కొందరు కామెంట్ చేశారు.