Family Union After 75 Years : కర్తార్‌పూర్ కారిడార్‌లో అపూర్వ దృశ్యం, 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే..ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అంటూ పాట పాడుకునే సందర్భం వచ్చింది ఆ అక్కా తమ్ముళ్లకు! కానీ మాటకూడా పెగలని ఉద్విగ్నతలో పాటేం పాడుకుంటారు? 75 ఏళ్ల కిందట విడిపోయిన ఆ తోబుట్టువులు మళ్లీ కలుసుకుంటే ఆనందంతో కళ్లు చెమ్మగిల్లకుండా ఉంటాయా?
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే..ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అంటూ పాట పాడుకునే సందర్భం వచ్చింది ఆ అక్కా తమ్ముళ్లకు! కానీ మాటకూడా పెగలని ఉద్విగ్నతలో పాటేం పాడుకుంటారు? 75 ఏళ్ల కిందట విడిపోయిన ఆ తోబుట్టువులు మళ్లీ కలుసుకుంటే ఆనందంతో కళ్లు చెమ్మగిల్లకుండా ఉంటాయా? దేశ విభజన సమయంలో విడిపోయిన వారిద్దరిని సోషల్ మీడియా కలిపింది. ఎప్పుడో బాల్యంలో వేరుపడిన అక్క తమ్ముడు వృద్దాప్యంలో కలుసుకున్నారు. కర్తార్‌పూర్ కారిడార్(Kartarpur Corridor) దగ్గర కలుసుకున్న వారిద్దరు ఉద్విగ్నభరితులయ్యారు. దేశ విభజన సమయంలో పంజాబ్‌కు(Punjab) చెందిన సర్దార్ భజన్‌సింగ్(Sardhar Bhajan singh) కుటుంబం చెల్లాచెదురయ్యింది.
భజన్‌సింగ్ కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్(Kashmir)కు చేరుకున్నాడు. కూతురు మహేంద్రకౌర్(Mahendra Kaur) మాత్రం భజన్‌సింగ్‌తోనే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో నివాసం ఉంటున్న 81 ఏళ్ల మహేంద్రకౌర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటున్న 78 ఏళ్ల షేక్ అబ్దుల్ అజీజ్ స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. రెండు కుటుంబాలు కర్తార్‌పూర్‌క కారిడార్ ద్వారా గురుద్వార దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. అరనిమిషం పాటు మాట పెగల్లేదు. ఆనందభాష్పాలతో కళ్లు మసకబారాయి. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.