ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) లేఖ రాశారు. మహిళా బిల్లుకు మద్దతు కోరుతూ మీరు రాసిన లేఖ అందింది. తెలంగాణలో మహిళలకు న్యాయం చేయకుండా ఈ పోరాటాన్ని జాతీయ వేదికపైకి ఎలా తీసుకువెళ్తారు.? అని ఆమె క‌విత‌ను ప్ర‌శ్నించారు. మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి దాకా..

ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) లేఖ రాశారు. మహిళా బిల్లుకు మద్దతు కోరుతూ మీరు రాసిన లేఖ అందింది. తెలంగాణలో మహిళలకు న్యాయం చేయకుండా ఈ పోరాటాన్ని జాతీయ వేదికపైకి ఎలా తీసుకువెళ్తారు.? అని ఆమె క‌విత‌ను ప్ర‌శ్నించారు. మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి దాకా.. 5 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించలేదు. మంత్రి వర్గంలోనూ మహిళలకు ప్రాధాన్యత లేదు.. సీఎం కూతురిగా మీ తండ్రిని ఏనాడూ ఈ అంశంపై ప్రశ్నించలేదు. మీ పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఢిల్లీ(Delhi) వేదికగా ఉద్యమం చేయడం హాస్యాస్పదం అని అన్నారు.

మహిళా రిజర్వేషన్(Women Reservation) పై ముందు మీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని లేఖ‌లో సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎక్కువ మందికి ఈ ఎన్నికల్లో సీట్లు ఇవ్వండి. ఇదే మీ ఉద్యమానికి మొదటి అడుగు అవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ తేల్చకుండా డిల్లీ వేదికగా ఉద్యమం చేయడం బీఆర్ఎస్‌ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు. మహిళా బిల్లుపై దేశ వ్యాప్త మద్దతు కూడగట్టే ముందు.. కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకూ మహిళలకు మీరిచ్చిన సీట్లు ఎన్ని.? అని ప్ర‌శ్నించారు. 2014లో మహిళలకు మీరిచ్చిన సీట్లు 6 అని గుర్తుకు లేదా.? 2018లో మీరిచ్చిన సీట్లు 4 అని మీకు కనపడటం లేదా.? సీట్ల కేటాయింపులో ఒక మహిళగా మీరు నోరు ఎందుకు ఎత్తలేదు.? 2014 లో మీకు ఒక ఎంపీ స్థానం, 2019లో ఇద్దరికీ అవకాశం ఇదేనా.. మహిళలకు పెద్దపీట? మీ మొదటి దఫా ప్రభుత్వంలో మహిళా మంత్రి ఎందుకు లేరు? సుదీర్ఘకాలం పాటు ఎందుకు మహిళా కమిషన్ ను పెండింగ్ లో పెట్టారు? మహిళా బిల్లుపై మీరు దీక్ష చేసిన తర్వాత.. ఇప్పుడు 7 సీట్లు కేటాయించడం ఏంటి? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని మీరు ఇతర పార్టీల చిత్తశుద్ధిని ఎలా ప్రశ్నిస్తారు? మీకు ఆ హక్కు ఎక్కడిది? తెలంగాణలో మహిళలను దొక్కింది మీ ప్రభుత్వం కాదా? మహిళలపై దాడులు చేసి కించపరిచింది మీ పార్టీ కాదా? ఉన్నట్లుండి మహిళా రిజర్వేషన్లు అంటూ ముందటేసుకున్న మీ ఆంతర్యం ఏంటి.? రాబోయే ఎన్నికల్లో మహిళల నుంచి వచ్చే వ్యతిరేకత దృష్ట్యా.. నష్ట నివారణ చర్యల్లో ఇది ఒక ఎత్తుగడనా.? అని ప్ర‌శ్న‌లు సంధించారు.

కవితకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఒక మహిళగా తెలంగాణ అసెంబ్లీలో పార్లమెంట్ లో హక్కుల కోసం జరిపే పోరాటంలో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. కానీ మహిళా రిజర్వేషన్ విషయంలో మీ రాజకీయ క్రీడలో నేను భాగం కాలేను. తెలంగాణ మహిళా వాదాన్ని చేపట్టి, మీ తండ్రిని నిలదీసిన పక్షంలో నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇది మీతో సాధ్యప డుతుంది అని నేను భావిస్తున్నాను అని లేఖ‌లో పేర్కొన్నారు.

తెలంగాణ మహిళా వాదాన్ని మీరు బుజంపైకి ఎత్తుకుంటే.. మీతో కలిసి పోరాటం చేసే తొలి మహిళను నేనేన‌ని స్ప‌ష్టం చేశారు. మార్పు ఏదైనా ఇంటి నుంచి మొదలు కావాలని పెద్దలు చెప్పారు. అందుకే కవిత ముందు ఇంట గెలిచి.. రచ్చ గెలవాలని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా మీకు పంపుతాం. ఆ జాబితా చూసి డిల్లీ విమానం ఎక్కే ముందు మహిళలకు ఎంత శాతం ఇచ్చారో చూసుకోవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంస్కరణలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎదురు చూస్తున్నామ‌న్నారు. మహాత్మా ఒక మాట చెప్పారు. మీరు చూడాలి అనుకుంటున్న మార్పు.. మీ నుంచే మొదలు పెట్టండి. మహాత్మా చెప్పిన ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానని లేఖ‌లో వెల్ల‌డించారు.

Updated On 6 Sep 2023 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story