తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్నాయి. అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసింది. బీఫామ్‌లు కూడా ఇచ్చేసింది. అధికారంలోకి రావాలని ఉవ్విళూరుతున్న కాంగ్రెస్‌(congress), అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్నాయి. అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసింది. బీఫామ్‌లు కూడా ఇచ్చేసింది. అధికారంలోకి రావాలని ఉవ్విళూరుతున్న కాంగ్రెస్‌(congress), అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కేసీఆర్‌ను(KCR) గద్దె దింపుతామని, తెలంగాణలో వైఎస్‌ పాలనను తెస్తామని చెప్పిన వైఎస్‌ షర్మిలమ్మ(YS Sharmila) పార్టీలో మాత్రం కదలిక లేదు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని(YSRTP) స్థాపించి పాదయాత్ర చేపట్టిన షర్మిల పార్టీ ఇంతకీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? కనీసం షర్మిల అయినా బరిలో దిగుతారా? అనే అనుమానాలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌(Congress) పార్టీలో విలీనం అవుదామనుకున్నా చివరి నిమిషంలో కాంగ్రెస్‌ ఎందుకో ఆ ప్రతిపాదనను కాదనేసింది. షర్మిలను దూరం పెట్టింది. దీంతో షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌లో విలీన ప్రతిపాదన ఆగిపోయిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరతామని ప్రకటించారు షర్మిల. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పార్టీలన్నీ చురుకుగా వ్యవహరిస్తుంటే షర్మిల పార్టీలో మాత్రం నిర్లిప్తత చోటు చేసుకుంది. అసలు పోటీ చేయాలన్న ఉత్సాహమే వైఎస్సార్‌టీపీలో కనిపించడం లేదు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అధికారపార్టీ నేతలపై హద్దులుదాటి విమర్శలు చేశారు. నిరుద్యోగుల కోసం దీక్షలు చేశారు. పోలీసులతో కయ్యం పెట్టుకున్నారు. చివరకు కేసీఆర్‌ను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అంటే పడని ఓ వర్గం మీడియా అయితే తెలంగాణలో షర్మిల పార్టీ పెను ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రజలు ఆ రకమైన అభిప్రాయానికి వచ్చేలా చేసింది.

విపక్షపార్టీలన్నీ ఏకమై కేసీఆర్‌ను గద్దె దించుదామని షర్మిల చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌, బీజేపీలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇలా అయితే కష్టమేనని భావించిన షర్మిల క‌ర్నాట‌క ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ ద్వారా కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయ‌డానికి రాయ‌బారం న‌డిపారు. ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చారు. కాంగ్రెస్‌ కూడా షర్మిలకు పార్టీలో పెద్ద పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యిందని, ఇక వీలీన‌మే మిగిలిందని మీడియా రాసింది. అయితే విలీనం ఆగిపోయింది. అందుకు కారణం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డినేనని(Revanth Reddy) ప్రచారం జరిగింది.

కాంగ్రెస్‌ పార్టీ తనను ఘోరంగా అవమానించిందనే భావనకు షర్మిల వచ్చారు. త‌న పార్టీ నాయ‌కుల‌తో ఆమె స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలి బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌కూడ‌ద‌ని తాను ఆశించానని, అయితే కాంగ్రెస్ నుంచి తగిన స్పందన రాలేదని షర్మిల చెప్పుకొచ్చారు. ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించారు. అయితే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు గ‌డువు ముంచుకొస్తున్నా ష‌ర్మిల త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు.

అసలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్న వాతావరణం కూడా ఆ పార్టీలో కనిపించడం లేదు. ఖమ్మం(Khammam) జిల్లా పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని పార్టీ పెట్టినప్పట్నుంచి చెప్పుకుంటూ వచ్చిన షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా అనుమానంగా మారింది. కాంగ్రెస్ నుంచి త‌మ కుటుంబ స‌న్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్న కారణంగానే ష‌ర్మిల త‌ప్పుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టడమే షర్మిల చేసిన పెద్ద తప్పిదమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ష‌ర్మిల రాజ‌కీయ ప్ర‌యోగం ఫెయిల్‌ అయినట్టేనని అనుకోవాలి.

Updated On 28 Oct 2023 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story