తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడుగా ముందుకు వెళుతూ ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రకటించింది. షర్మిల ఛైర్మన్‌గా 20 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. సభ్యులుగా పార్టీ సీనియర్ నాయకులు ఎన్ రఘువీరా రెడ్డి, టి సుబ్బరామిరెడ్డి, పల్లం రాజు, కె రాజు, కెవిపి రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, ఎస్ శైలజానాథ్, చింతా మోహన్, జెడి శీలం, కె బాపిరాజు, ఎన్ తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతం, రాకేష్ రెడ్డి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు, సూర్య నాయక్, శ్రీనివాస రెడ్డి ఉన్నారు. ఎపిపిసిసి అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎన్ రాజా, కాంగ్రెస్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు.