గర్భస్రావం మాత్రలు వేసుకొని ఓ యువతి మరణించింది. ఈ గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్‌కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఓ యువతి తన ప్రియుడితో సాన్నిహిత్యంగా మెలగడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో
యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారి(PMP Harikrishna chari)ని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మందులను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 10న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.