తెలంగాణలో(Telangana) రాజకీయాలు వేడెక్కాయి.

తెలంగాణలో(Telangana) రాజకీయాలు వేడెక్కాయి. అరికెపూడి గాంధీ(Arikepudi gandhi) తాను బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యేనని చెప్పడంతో ఈ వివాదం ముదిరింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్‌ఎస్ కండువా కప్పుకోవాలని, గాంధీ ఇంటి మీద బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని, గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి(Koushik) వ్యాఖ్యానించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రారా నా కొడుకా అంటూ గాంధీ సవాల్‌ విసిరారు. కౌశిక్‌రెడ్డి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పడంతో హౌజ్‌ అరెస్ట్(House arrest) చేశారు. దీంతో నేనే నీ ఇంటికి వస్తున్నా అంటూ కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లిన తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలు విసిరారు. ఈ దాడిలో కౌశిక్‌రెడ్డి ఇంటి అద్దాలు పగిలిపోయాయి. కౌశిక్‌రెడ్డికి సంఘీభావంగా హరీష్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అతని ఇంటికి చేరుకుని అక్కడి నుంచి సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి అక్కడే బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి కేశంపేట పీఎస్‌కు తరలించి అర్ధరాత్రి హరీష్‌రావుతో మిగతా ఎమ్మెల్యేలను విడిచిపెట్టారు.

ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ వివాదం తెరపైకి వచ్చింది. పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడే ప్రాంతీయ వివాదం(Regional disputes) ఎందుకు వస్తోందనేది చర్చనీయాంశమైంది. తెలంగాణకు ముందు కొంత ప్రాంతీయ విభేదాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నిర్భయంగా ఉండొచ్చని హామీ ఇచ్చారు. పదేళ్లుగా ఎక్కడా చిన్న సంఘటన జరిగిన దాఖలాలు లేవు. అయితే కౌశిక్‌రెడ్డిపై గాంధీ వ్యాఖ్యలకు కౌశిక్‌రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. కరీంనగర్‌ నుంచి నుంచి హైదరాబాద్‌ వచ్చావు.. నువ్వు నెక్కర్లు వేసుకోకముందు నుంచే నేను హైదరాబాద్‌లో ఉంటున్నా అన్నాడు. దీంతో కౌశిక్‌రెడ్డి కూడా గాంధీని ఉద్దేశించి, ఆంధ్ర నుంచి నువ్వు బతకనీక వచ్చావన్నాడు. దీంతో ఈ చర్చ ప్రారంభమైంది. ఎవరికి వారు దీనిని తమనే అన్నారని అన్వయించుకుంటున్నారు. ప్రాంతీయ సెంటిమెంట్‌ను రేవంత్‌రెడ్డే రెచ్చగొట్టి తదనుగుణంగా బీఆర్‌ఎస్‌కు సెటిలర్లు దూరమయ్యేలా చూస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే మరికొందరేమే బీఆర్‌ఎస్సే ప్రాంతీయ విభేదాలు సృష్టించి తదనుగుణంగా సెంటిమెంట్‌ను రాజేయ్యాలని చూస్తున్నారని కొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే నిన్న హరీష్‌రావు, ఈరోజు కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. గత పదేళ్లుగా ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నామని, కావాలనే కొందరు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ ప్రాంతం నుంచి వచ్చినా హైదరాబాద్‌లో అందరం ప్రశాంతంగా ఉందామని వారు స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి ఇప్పటికైనా తెరదించాలని పొలిటికల్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story