గత రెండు రోజులుగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.
గత రెండు రోజులుగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అరికెపూడి గాంధీ(Arikepudi gandhi) తాను బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేనని చెప్పడంతో ఈ వివాదం ముదిరింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్‌ఎస్ కండువా కప్పుకోవాలని, గాంధీ ఇంటి మీద బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని, గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రారా నా కొడుకా అంటూ గాంధీ సవాల్ విసిరారు. కౌశిక్‌రెడ్డి(Loushik reddy) గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పడంతో హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో నేనే నీ ఇంటికి వస్తున్నా అంటూ కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లిన తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలు విసిరారు. ఈ దాడిలో కౌశిక్‌రెడ్డి ఇంటి అద్దాలు పగిలిపోయాయి. కౌశిక్‌రెడ్డికి సంఘీభావంగా హరీష్‌రావుతో(Harish rao) పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అతని ఇంటికి చేరుకుని అక్కడి నుంచి సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి అక్కడే బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి కేశంపేట పీఎస్‌కు తరలించి అర్ధరాత్రి హరీష్‌రావుతో మిగతా ఎమ్మెల్యేలను విడిచిపెట్టారు.
ఈ వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్(Mahesh kumar goud) మాట్లాడుతూ అది ఇద్దరి మధ్య జరిగిన వివాదమని, దానికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రయితే ఏకంగా అరికెపూడి గాంధీని అసలు కాంగ్రెస్ పార్టీ కాదని, అతను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయినందునే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామన్నారు. దీనికి మంత్రి కోమట్టిరెడ్డి(Komati reddy) కూడా వత్తాసుపలికారు. అవునూ అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని మీడియాతో గట్టిగా వాదించారు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే అతను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు దానం నాగేందర్‌కు(Dhanam Nagender) అతనితో ఏంటి పని.. గాంధీ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. దానం నాగేందర్ కూడా బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. ఏకంగా కాంగ్రెస్ బీ-ఫాంతో ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ అధికారికంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. పార్టీ ఫిరాయించినట్లు కోర్టు కూడా పరోక్షంగా అంగీకరించి స్పీకర్‌కు ఆదేశాలు కూడా ఇచ్చింది.
దానం నాగేందర్ కాంగ్రెస్ అయినప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు వెళ్లినట్లు అని, అదే స్థానంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని గాంధీ ఇంటికి వెళ్లేందుకు ఎందుకు అంగీకరించలేదని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తలా ఒక మాట మాట్లాడ్డం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో వాదన ముందుకు తేవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.